రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్ : బస్తర్ అడవుల్లో ఒకప్పుడు ఆయుధాలు పట్టుకుని తిరిగిన మహిళలు.. ఇప్పుడు అదే ఆత్మవిశ్వాసంతో మోడలింగ్ ర్యాంప్‌పై అడుగులు వేశారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మహిళా మావోయిస్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాయ్‌పూర్‌లోని పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మహిళా మావోయిస్టులు కోసా పట్టు, చేతితో నేసిన సంప్రదాయ ఛత్తీస్‌గఢ్ వస్త్రాలను ధరించి ర్యాంప్ వాక్ చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బస్తర్ ప్రాంతానికి చెందిన ఈ మహిళలు గతంలో మావోయిస్టు ఉద్యమంలో పనిచేశారు. అనంతరం ఉద్యమాన్ని వీడి లొంగిపోయి సాధారణ జనజీవనంలోకి తిరిగి వచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం, సమాజం నుంచి లభిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ వివిధ రంగాల్లో తమ జీవితాలను తీర్చిదిద్దుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ కూడా హాజరయ్యారు. ర్యాంప్ వాక్ చేసిన మాజీ మహిళా మావోయిస్టులతో సీఎం ప్రత్యేకంగా మాట్లాడి, వారి కొత్త జీవిత ప్రయాణం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. మావోయిజాన్ని వీడి సాధారణ జీవితంలోకి తిరిగి వచ్చిన వారికి పునరావాసం, సాధికారత లాంటి అవకాశాలు దోహదపడతాయని అధికారులు చెబుతున్నారు. మాజీ మహిళా మావోయిస్టుల మార్పు ఇతర మావోయిస్టులకు కూడా జనజీవనంలోకి తిరిగి రావడానికి ప్రేరణగా నిలుస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
Loading Tweet...




















