టీ బ్రేక్.. 28 మంది ప్రాణాలు కాపాడింది! నేపాల్‌ వరదల నుంచి బయటపడిన యాత్రికులు

నేపాల్‌ వరదల్లో చిక్కుకుని తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ 28 మంది కైలాస్‌ మానస సరోవర్‌ యాత్రికులు శనివారం స్వస్థలాలకు చేరుకున్నారు. కేవలం పది నిమిషాల ఆలస్యం, టీ తాగేందుకు తీసుకున్న చిన్న విరామం తమ ప్రాణాలను కాపాడాయని వారు తెలిపారు.

30 ఆగస్టు, 2026 6:12 PM•ByNarender Kumar Nangunoori

Share this article

టీ బ్రేక్.. 28 మంది ప్రాణాలు కాపాడింది! నేపాల్‌ వరదల నుంచి బయటపడిన యాత్రికులు

తెలంగాణా, ఆంద్రప్రదేశ్ (జనవాణి): నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు పలువురి జీవితాలను అతలాకుతలం చేశాయి. అయితే కైలాస్‌ మానస సరోవర్‌ యాత్రకు వెళ్లిన 28 మంది యాత్రికులకు మాత్రం ఓ చిన్న టీ విరామం, పది నిమిషాల ఆలస్యం ప్రాణరక్షకంగా మారాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటకకు చెందిన ఈ యాత్రికులు శనివారం సురక్షితంగా స్వస్థలాలకు చేరుకున్నారు.

టీ బ్రేక్‌తో తప్పిన పెను ప్రమాదం

తిరుపతికి చెందిన సైన్‌ ఇన్‌ ట్రావెల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పెమ్మసాని వెంకటరమణ మాట్లాడుతూ.. స్యాబ్రుబేసికి ముందుగానే చేరుకోవాల్సి ఉన్నప్పటికీ టీ తాగేందుకు కాసేపు ఆగామని తెలిపారు. ఆ తర్వాత మరో పది నిమిషాలు ఆలస్యం కావడం తమకు కలిసొచ్చిందన్నారు. అదే సమయంలో ప్రకృతి విపత్తు సంభవించిందని చెప్పారు. పరిస్థితిని గమనించిన డ్రైవర్‌ వెంటనే అప్రమత్తమై మార్గాన్ని మార్చాడని, తమను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాడని వెంకటరమణ వివరించారు. తాము అనుకున్న సమయానికి అక్కడికి చేరుకుని ఉంటే వరద ఉధృతికి కొట్టుకుపోయిన వంతెనపైనే ఉండేవాళ్లమని తెలిపారు.

వీసా ఆలస్యం.. మరో 28 మందికి వరం

విశాఖపట్నానికి చెందిన కృష్ణయ్య తమ ప్రాణాలను వీసా ఆలస్యం కాపాడిందని చెప్పారు. తమ బృందంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటకకు చెందిన 28 మంది ఉన్నారని తెలిపారు. వీసాలు ఆలస్యం కావడంతో ప్రయాణం మూడు రోజులు వాయిదా పడిందన్నారు. ప్రణాళిక ప్రకారం యాత్ర కొనసాగి ఉంటే వరదలు సంభవించిన సమయంలో తాము స్యాబ్రుబేసి వంతెనపై ఉండేవాళ్లమని కృష్ణయ్య తెలిపారు. ఆ సమయంలో వంతెన కొట్టుకుపోవడంతో తమ బృందం మొత్తం ప్రమాదంలో చిక్కుకునేదని, ఈ ఆలోచనే భయాందోళనకు గురిచేస్తోందన్నారు.

నేపాల్‌కు భారత్‌ సహాయం

టిబెట్‌ సరిహద్దు వెంబడి నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఇప్పటివరకు 750 మంది మృతి చెందగా.. వేలాది మంది గల్లంతైనట్లు సమాచారం. సహాయక, గాలింపు చర్యల్లో నేపాల్‌కు భారత్‌ అండగా నిలిచింది. ఆగస్టు 29న 11 మంది సభ్యులతో కూడిన బృందం ఖాఠ్మాండూకు చేరుకోగా.. అనంతరం మరో ప్రత్యేక విమానం అత్యవసర మానవతా సహాయ సామగ్రితో నేపాల్‌కు చేరింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. సహాయక చర్యలకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని కూడా భారత్‌ అందిస్తున్నట్లు తెలిపారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు