హైదరాబాద్, ఆగస్టు 11(జనవాణి): తెలంగాణ పర్యాటక రంగాన్ని మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మీ ఇంటినే హోటల్‌గా మార్చుకొని అదనపు ఆదాయం పొందొచ్చు. స్థానికులకు పర్యాటకం ద్వారా అదనపు ఆదాయం కల్పించే లక్ష్యంతో ప్రత్యేక హోమ్‌స్టే పథకాన్ని త్వరలో ప్రారంభించనుంది. ఇందులో భాగంగా అర్హత కలిగిన ఇళ్ల యజమానుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. తెలంగాణ టూరిజం పాలసీ 2025-30లో భాగంగా ఈ హోమ్‌స్టే విధానాన్ని రూపొందించారు. హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలకే పర్యాటకాన్ని పరిమితం చేయకుండా గ్రామీణ, పట్టణ, గిరిజన ప్రాంతాలకు విస్తరించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. స్థానిక ఇళ్లను పర్యాటక వసతులుగా మార్చడం ద్వారా కుటుంబాలు చిన్న స్థాయి పర్యాటక వ్యాపారవేత్తలుగా మారే అవకాశం కల్పించనున్నారు.
ఎలాంటి ఇళ్లకు అవకాశం?
ఈ మేరకు పర్యాటక శాఖ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అర్హత కలిగిన ఇంటి ఓనర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానించనుంది. ప్రైవేట్ ఇళ్లు, వారసత్వ భవనాలు, సంప్రదాయ గృహాలు, గ్రామీణ ఇళ్లు, గిరిజన ప్రాంతాల్లోని సంప్రదాయ నివాసాలు, కొన్ని రకాల రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లు హోమ్‌స్టే పథకానికి అర్హత పొందవచ్చు. అయితే ఇప్పటికే హోటళ్లు, రిసార్టులు, లాడ్జీలు, హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ వసతులు, డార్మిటరీలు, సర్వీస్డ్ అపార్ట్‌మెంట్లను హోమ్‌స్టేలుగా నమోదు చేయరు.
మూడు కేటగిరీలుగా హోమ్‌స్టేలు
నమోదైన హోమ్‌స్టేలను మూడు కేటగిరీలుగా వర్గీకరించనున్నారు. వివిధ శాఖల అధికారులతో కూడిన కమిటీ సంబంధిత ఇళ్లను పరిశీలించి కేటగిరీపై సిఫారసు చేస్తుంది. తుది ఆమోదం పర్యాటక శాఖ ఇస్తుంది. అర్హత పొందిన యజమానులకు కేటగిరీ సర్టిఫికెట్‌తో పాటు తెలంగాణ టూరిజం ప్రచార వేదికల్లో డిజిటల్ లిస్టింగ్ కల్పించనున్నారు. హోమ్‌స్టే నమోదుకు వచ్చిన దరఖాస్తులను 30 పని దినాల్లో పరిష్కరించేలా మార్గదర్శకాలు రూపొందించారు. రిజిస్ట్రేషన్ రెండేళ్ల పాటు చెల్లుబాటు కానుంది.
పర్యాటకులకు లోకల్ ఎక్స్‌పీరియన్స్
హోమ్‌స్టేల్లో బస చేసే పర్యాటకులకు సాధారణ హోటళ్లకు భిన్నమైన లోకల్ ఎక్సిపీరియన్స్ లభించే అవకాశం ఉంటుంది. స్థానిక కుటుంబాలతో కలిసి ఉండటం ద్వారా తెలంగాణ వంటకాలు, హస్తకళలు, జానపద కళలు, సంప్రదాయాలు, పండుగలు, జీవనశైలిని ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో స్థానిక ఉత్పత్తులకు కొత్త మార్కెట్ ఏర్పడే అవకాశం ఉంది. భారీ హోటళ్లు, వాణిజ్య భవనాలు నిర్మించకుండానే రాష్ట్రంలో వసతి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా నిర్మాణ వ్యయం, భూమి వినియోగం, పర్యావరణంపై ఒత్తిడిని తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలకు సమీపంలోని గ్రామీణ, గిరిజన కుటుంబాలకు ఇది ప్రత్యక్ష ఆదాయ వనరుగా మారనుంది.
మూడు లక్షల ఉద్యోగాల లక్ష్యం
తెలంగాణ తొలి ప్రత్యేక పర్యాటక విధానమైన తెలంగాణ టూరిజం పాలసీ 2025-30లో ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, మూడు లక్షల ఉద్యోగాలను సృష్టించడం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగం వాటాను రెండంకెలకు పెంచడం వంటి లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించింది. ఈ లక్ష్యాల సాధనలో హోమ్‌స్టేలు కీలకంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలకు సమీపంలోని గ్రామీణ, గిరిజన కుటుంబాలకు ఇది ప్రత్యక్ష ఆదాయ వనరుగా మారనుంది. స్థానిక ఆహారం, కళలు, హస్తకళలు, సంప్రదాయాలకు పర్యాటక మార్కెట్ కల్పిస్తూ.. ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ టూరిజాన్ని అభివృద్ధి చేయడమే ఈ పథకం లక్ష్యంగా కనిపిస్తోంది. మొత్తంగా హోమ్‌స్టే పథకం ద్వారా పర్యాటకం కేవలం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఆధారిత రంగంగా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి చెందే అవకాశముందని నిపుణులు అంటున్నారు.




















