హైదరాబాద్,సెప్టెంబర్ 25 (జనవాణి): 'బాలాపూర్ గణేష్ ఉత్సవాల్లో చివరి పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పూజల అనంతరం క్రేన్ సాయంతో గణనాథుడిని మినీ ట్రక్కుపైకి ఎక్కించి గ్రామ ప్రదక్షిణ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ప్రారంభం కానుంది.
ఖైరతాబాద్ మహాగణపతి తర్వాత హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది బాలాపూర్ లడ్డూ వేలమే. గణేశుడి చేతిలో ఉండే లడ్డూను దక్కించుకుంటే ఇంట్లో సిరిసంపదలు, శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. దీంతో ప్రతి ఏడాది ఈ వేలం కోసం భక్తులు, స్థానికులు, స్థానికేతరులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
రూ.450 నుంచి రూ.35 లక్షలకు..
బాలాపూర్ లడ్డూ వేలం 1994లో కేవలం రూ.450తో ప్రారంభమైంది. అప్పటి నుంచి దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. 2001 వరకు వేలల్లోనే పలికిన లడ్డూ ధర.. 2002లో తొలిసారి లక్ష దాటింది. కందాడ మాధవరెడ్డి రూ.1.05 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. ఆ తర్వాత లడ్డూ ధర ఏటా పెరుగుతూ వచ్చింది. 2007లో రఘునందన చారి రూ.4.15 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. 2015లో తొలిసారి రూ.10 లక్షల మార్కును దాటి రూ.10.32 లక్షలకు చేరింది. 2016లో రూ.14.65 లక్షలు, 2017లో రూ.15.60 లక్షలు, 2018లో రూ.16.60 లక్షలకు లడ్డూ వేలం జరిగింది.
2019లో కొలను రాంరెడ్డి రూ.17.60 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. 2020లో కరోనా కారణంగా వేలం నిర్వహించలేదు. 2021లో రూ.18.90 లక్షలకు లడ్డూ వేలం జరిగింది. 2022లో ఏకంగా రూ.24.60 లక్షలకు చేరి మరో రికార్డు సృష్టించింది. 2023లో రూ.27 లక్షలకు దయానందరెడ్డి లడ్డూను దక్కించుకోగా.. 2024లో కొలను శంకర్ రెడ్డి రూ.30.01 లక్షలకు సొంతం చేసుకున్నారు. ఇక 2025లో కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ రూ.35 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.
ఈసారి ఎంత ధర పలుకుతుందో?
ఏటా లడ్డూ ధర పెరుగుతూ రావడంతో ఈసారి వేలంపాటపై ఆసక్తి మరింత పెరిగింది. గతేడాది రూ.35 లక్షలకు చేరిన ధర.. ఈసారి మరో రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని ఉత్సవ సమితి అంచనా వేస్తోంది. దీంతో బాలాపూర్ లడ్డూ ఈసారి ఎంత ధర పలుకుతుందన్నది ఉత్కంఠగా మారింది. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని సమాజ సేవా కార్యక్రమాలకు వినియోగించడం బాలాపూర్ గణేష్ ఉత్సవాల మరో ప్రత్యేకతగా నిలుస్తోంది.




















