తెలంగాణ బోనాల జాతర 2026: తెలంగాణ ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో ఎదురుచూసే బోనాల మహోత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటలో అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఈ ఏడాది బోనాల వేడుకలకు శ్రీకారం చుట్టనున్నారు.
డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, సంప్రదాయ వస్త్రధారణలో మహిళలు బోనాలు ఎత్తుకుని ఆలయాలకు తరలివెళ్లే దృశ్యాలతో తెలంగాణ అంతా భక్తిరసంలో మునిగిపోనుంది.
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని సుమారు 3 వేలకుపైగా ఆలయాల్లో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రత, ట్రాఫిక్, పారిశుధ్యం, తాగునీరు, వైద్య సేవలు వంటి అన్ని ఏర్పాట్లు అందుబాటులో ఉంచింది.
బోనాల ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, సామాజిక ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.20 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించినట్లు తెలిపారు.
అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి.. ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని కోరారు.
Loading Tweet...




















