యాదాద్రి , జూలై 23: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి తెలంగాణ సస్యశ్యామలంగా మారాలని, రైతాంగం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజల ఆయురారోగ్యాలు, ప్రకృతి సమతుల్యత నెలకొనాలని ఆకాంక్షిస్తూ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నిర్వహించిన వరుణ యాగ పూర్ణాహుతి కార్యక్రమంలో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పరిస్థితిని అధిగమించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ చర్యలకు దైవానుగ్రహం కూడా తోడవ్వాలనే సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో వరుణ యాగాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో చెరువులు, నదులు, జలాశయాలు నిండుకుండల్లా కళకళలాడాలని, పచ్చదనం వెల్లివిరియాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయాల్లో ప్రత్యేక వరుణ యాగాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
భారతీయ సంస్కృతిలో ప్రకృతిని దైవస్వరూపంగా ఆరాధించే సంప్రదాయం ఉందని మంత్రి పేర్కొన్నారు. వరుణ యాగం అనేది కేవలం వైదిక క్రతువు మాత్రమే కాదని, ప్రకృతి సమతుల్యత, ప్రజల శ్రేయస్సు, సమృద్ధిగా వర్షాలు కురవాలనే మహా సంకల్పానికి ప్రతీక అని అన్నారు.

"మన సంస్కృతి ప్రకృతిని జయించమని కాదు.. ప్రకృతితో కలిసి జీవించమని బోధిస్తుంది. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రకృతి కూడా సహకరించాలని కోరుతూ ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ, వేద సంప్రదాయాలను పరిరక్షిస్తూ రాష్ట్రంలోని దేవాలయాల్లో వరుణ యాగాలు నిర్వహిస్తున్నాం. ఇది ప్రకృతి పట్ల మన కృతజ్ఞతను, బాధ్యతను చాటే భారతీయ జీవన తత్వానికి నిదర్శనం" అని మంత్రి సురేఖ పేర్కొన్నారు.
వరుణ యాగ పూర్ణాహుతి సందర్భంగా వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య మంత్రి కొండా సురేఖ అగ్నిదేవునికి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రజల ఆయురారోగ్యాలు, రైతాంగ శ్రేయస్సు, ప్రకృతి సమతుల్యత నెలకొని సమృద్ధిగా వర్షాలు కురిసి తెలంగాణ సస్యశ్యామలంగా మారాలని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ప్రత్యేకంగా ప్రార్థించారు.
మంత్రి ఆలయానికి చేరుకున్న సందర్భంగా దేవస్థాన ఈవో భవానీ శంకర్, డిప్యూటీ ఈవో భాస్కర్, ప్రధాన అర్చకులు, వేదపండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూర్ణాహుతి అనంతరం అర్చకులు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలను మంత్రికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ట్రస్ట్ బోర్డు సభ్యుడు లక్ష్మీనారాయణ నాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.




















