FlyDubai | ఫ్లైదుబాయ్ విమాన ఘటనపై అమెరికా మీడియాలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టెల్ అవీవ్ వైపు వస్తున్న విమానాన్ని అవసరమైతే కూల్చివేయాలని ఇజ్రాయెల్ ఒక దశలో భావించినట్టు కథనాలు పేర్కొన్నాయి. ఇందుకోసం ఫైటర్ జెట్లను కూడా రంగంలోకి దించినట్టు సమాచారం.
సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై దాడి చేసి, విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. విమానాన్ని టెల్ అవీవ్‌లోని ఓ ఎత్తైన భవనాన్ని ఢీకొట్టేలా చేయాలనే ఉద్దేశం అతడికి ఉన్నట్టు కూడా కథనాలు వెలువడ్డాయి. అయితే పరిస్థితిని గమనించిన కెప్టెన్ సరైన సమయంలో కాక్‌పిట్ తలుపు తెరవడంతో ప్రయాణికులు లోపలికి ప్రవేశించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానం సురక్షితంగా సౌదీ అరేబియాలోని తబుక్‌లో ల్యాండ్ అయింది.
30 సెకన్లలో 16 వేల అడుగుల దిగజారడంతో కలకలం
పైలట్ల మధ్య ఘర్షణ జరుగుతున్న సమయంలో విమానం కేవలం 30 సెకన్ల వ్యవధిలో దాదాపు 16 వేల అడుగుల మేర కిందకు దిగడం తీవ్ర ఆందోళనకు కారణమైంది. విమానంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్న విషయం తెలియడంతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. టెల్ అవీవ్ వైపు వస్తున్న విమానం కావడంతో ఇజ్రాయెల్ తన గగనతలాన్ని మూసివేసినట్టు సమాచారం. పరిస్థితి అదుపులోకి రాకపోతే విమానాన్ని కూల్చివేయాలనే అత్యంత కీలక నిర్ణయాన్ని కూడా ఇజ్రాయెల్ అధికారులు పరిశీలించినట్టు అమెరికా మీడియా పేర్కొంది.
ఫైటర్ జెట్లను రంగంలోకి దించిన ఇజ్రాయెల్
ఫ్లైదుబాయ్ విమానం వద్ద పరిస్థితిని అంచనా వేసేందుకు ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లను పంపినట్టు కథనాలు తెలిపాయి. ముందుగా విమానం సమీపానికి వెళ్లి కాక్‌పిట్‌లో ఏం జరుగుతోందో స్వయంగా పరిశీలించాలని ఫైటర్ జెట్ పైలట్లు భావించారు. విమానం నుంచి హైజాక్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారం అందకపోతే విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లి, తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోవాలని భావించినట్టు సమాచారం. పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారితే విమానాన్ని కూల్చివేయడమే చివరి మార్గంగా పరిగణించినట్టు తెలుస్తోంది. అయితే అప్పటికే ప్రయాణికులు నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి మారిపోయింది. విమానం కూడా ఇజ్రాయెల్ గగనతలంలోకి ప్రవేశించకుండా సౌదీ వైపు మళ్లింది. దీంతో ఇజ్రాయెల్ తన ఫైటర్ జెట్ల చర్యలను విరమించుకున్నట్టు సమాచారం. ఫ్లైదుబాయ్ ఘటన నేపథ్యంలో సౌదీ అరేబియా కూడా ఫైటర్ జెట్లను రంగంలోకి దించినట్టు కథనాలు వెల్లడించాయి.




















