Flydubai | దుబాయ్ నుంచి టెల్ అవీవ్(Tel Aviv)కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ బోయింగ్ 737 విమానంలో సెప్టెంబర్ 30న తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సుమారు 34 వేల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తున్న సమయంలో కో-పైలట్ హమామ్ అల్ హమామీ అకస్మాత్తుగా కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడికి దిగాడు. కాక్‌పిట్‌లో ఉన్న క్రాష్ యాక్స్‌తో కెప్టెన్‌పై దాడి చేసిన కో-పైలట్ విమానాన్ని తన నియంత్రణలోకి తీసుకుని కూల్చివేయాలనే కుట్రకు పాల్పడినట్లు యూఏఈ ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఈ ఘటనను వారు ఉగ్రవాద చర్యగా ధృవీకరించారు.
నిమిషాల్లో వేల అడుగుల దిగజారిన విమానం
కో-పైలట్ దాడి సమయంలో విమానం నియంత్రణలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానం నిమిషానికి సుమారు 23 వేల అడుగుల వేగంతో కిందికి దిగడం ప్రారంభించింది. దీంతో కొద్ది క్షణాల్లోనే విమానం 15,600 అడుగుల ఎత్తుకు చేరుకుంది. అయితే తీవ్ర ప్రమాదకర పరిస్థితుల్లోనూ కెప్టెన్ స్మిత్ మచ్చర్ అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారు. కో-పైలట్‌తో పోరాడుతూనే కాక్‌పిట్ డోర్‌ను తెరిచారు. దీంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది, ప్రయాణికులు వెంటనే స్పందించి హమామ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మరో ఇద్దరు పైలట్ల సహకారంతో సురక్షిత ల్యాండింగ్
విమానంలో ఉన్న మరో ఇద్దరు పైలట్ల సహాయంతో కెప్టెన్ స్మిత్ విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. కెప్టెన్ సమయస్ఫూర్తి, విమాన సిబ్బంది వేగంగా స్పందించడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై యూఏఈ అటార్నీ జనరల్ హమద్ సైఫ్ అల్ షమ్సీ ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. దాడి వెనుక ఉన్న ఉగ్రవాద సంబంధాలు, నిందితుడి ఉద్దేశాలు, అతడి గత కార్యకలాపాలపై ప్రత్యేక దర్యాప్తు బృందాలు విచారణ కొనసాగిస్తున్నాయి.
సిరియాలో గడిపిన హమామ్.. గతంపై అనుమానాలు
నిందితుడు హమామ్ అల్ హమామీ ఒమన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. తీవ్రవాద భావజాలంతో సంబంధాల కారణంగా గతంలో ఒమన్‌లో విమానాలు నడపకుండా అతడిపై నిషేధం విధించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. హమామ్ కొంతకాలం సిరియాలో గడిపినట్లు, అక్కడ తీవ్రవాద భావజాలానికి ఆకర్షితుడైనట్లు సమాచారం. అనంతరం యూఏఈకి వచ్చిన అతడు సుమారు ఎనిమిది నెలల క్రితమే ఫ్లైదుబాయ్‌లో చేరినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఒమన్ ఎయిర్, రాయల్ ఎయిర్ మారోక్ సంస్థల్లో పనిచేసినట్లు సమాచారం.
దాడికి ముందు సోషల్ మీడియాలో అనుమానాస్పద పోస్టులు
ఘటనకు కొన్ని గంటల ముందు హమామ్ సోషల్ మీడియా ఖాతాల్లో చేసిన పోస్టులు కూడా దర్యాప్తులో కీలకంగా మారాయి. ఇజ్రాయెల్ విమానాన్ని జూమ్ చేస్తూ తీసిన వీడియోతో పాటు అల్‌ఖైదా మాజీ నేత అల్-జవహరీ చిత్రాలు, మక్కా, మదీనా, జెరూసలేం పవిత్ర స్థలాలను కలిపిన ఏఐ-జనరేటెడ్ చిత్రాన్ని అతడు పోస్ట్ చేసినట్లు సమాచారం. ఈ సోషల్ మీడియా కార్యకలాపాలు, అతడి గతం, దాడి వెనుక ఉద్దేశం, ఇతర వ్యక్తులు లేదా సంస్థలతో సంబంధాలపై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో విమాన భద్రతపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.




















