FlyDubai | ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న భయానక ఘటనలో 174 మంది ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ తీవ్రంగా గాయపడ్డారు. కోపైలట్ హమామ్ అల్ హమ్మామీ కాక్‌పిట్‌లోని గొడ్డలితో మచ్చార్‌పై దాడి చేసినప్పటికీ ఆయన వెనక్కి తగ్గకుండా ప్రతిఘటించి విమానాన్ని సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించారు.
గత నెల 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఈ ఘటన జరిగింది. కోపైలట్ హమామీ అకస్మాత్తుగా కాక్‌పిట్‌లో ఉన్న గొడ్డలితో కెప్టెన్ మచ్చార్‌పై దాడి చేశారు. ఈ దాడిలో మచ్చార్ తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ పరిస్థితిని అదుపులోకి తీసుకుని విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే మచ్చార్‌ను సమీపంలోని ప్రిన్స్ సుల్తాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో ఆయన పుర్రెలో తీవ్ర గాయం ఉన్నట్లు గుర్తించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆయనను యూఏఈలోని అబుధాబి మిలిటరీ ఆసుపత్రికి తరలించారు.
పుర్రెలో తీవ్రమైన ఫ్రాక్చర్
మచ్చార్‌కు అయిన గాయాన్ని వైద్యులు ‘డిప్రెస్డ్ స్కల్ ఫ్రాక్చర్’గా పేర్కొన్నారు. ఈ తరహా గాయంలో పుర్రె ఎముక విరిగి దాని ముక్క లోపలికి, మెదడు వైపు చొచ్చుకుపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో మెదడుపై ఒత్తిడి పడటం లేదా మెదడుకు గాయం కావడం వంటి తీవ్ర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసర వైద్య చికిత్సతో పాటు అవసరమైతే శస్త్రచికిత్స కూడా చేయాల్సి ఉంటుందని తెలిపారు. మచ్చార్‌కు పుర్రెను రీకన్‌స్ట్రక్ట్ చేసే చికిత్స ఇప్పటికే అందించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఆయన చికిత్సకు బాగా స్పందిస్తున్నారని, వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. మచ్చార్‌ను చూసేందుకు ఆయన కుటుంబ సభ్యులను అధికారులు అనుమతించడంతో వారు ఆసుపత్రికి వెళ్లి ఆయనను కలిసి మాట్లాడారు. తీవ్రమైన గాయాలను సైతం లెక్కచేయకుండా చివరి క్షణం వరకు విధి నిర్వహించి విమానంలోని ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.




















