ఢిల్లీ,సెప్టెంబర్ 23 (జనవాణి): దేశ రాజధాని ఢిల్లీలో 17 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కల్కాజీ మందిర్ సమీపంలోని ఆస్థా కుంజ్ పార్క్లో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
తన స్నేహితుడితో కలిసి పార్కులో ఉన్న బాలిక వద్దకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు తాము పోలీసులమని చెప్పి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులుగా గుర్తించిన ఆసిఫ్, హేమంత్, ముఖేష్లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు, నిందితుల్లో ప్రధాన వ్యక్తిగా పేర్కొంటున్న ఆసిఫ్‌ను మంగళవారం తెల్లవారుజామున అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన సమయంలో లేడీ శ్రీరామ్ కాలేజీ వెనుక గేటుకు సుమారు 50 మీటర్ల దూరంలో పోలీసులు, నిందితుడి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆసిఫ్ కాలికి బుల్లెట్ గాయమైనట్లు పోలీసులు తెలిపారు.
కాలేజీకి సమీపంలోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడంతో విద్యార్థినుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. తాజా ఘటన నేపథ్యంలో విద్యార్థులు కాలేజీకి వెళ్లేందుకు కూడా భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన లేడీ శ్రీరామ్ కాలేజీ యాజమాన్యం మంగళవారం మధ్యాహ్నం నుంచి సాధారణ తరగతులను రద్దు చేసి సెలవు ప్రకటించింది. బుధవారం ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తోంది. విద్యార్థినుల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని కాలేజీ యాజమాన్యం పేర్కొంది.




















