న్యూఢిల్లీ, ఆగస్టు 11 (జనవాణి): పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో PM-SETU ITI క్లస్టర్ ఏర్పాటు చేయాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామిని తెలంగాణ కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రిని కలిసి పెద్దపల్లి ప్రాంతానికి PM-SETU ITI క్లస్టర్ అవసరాన్ని వివరించారు.
తెలంగాణ రాష్ట్రం PM-SETU కార్యక్రమంలో అగ్రగామిగా ఉన్న నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక PM-SETU ITI క్లస్టర్‌ను NMDC ద్వారా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పారిశ్రామిక, మైనింగ్ బెల్ట్‌గా ఉన్నందున స్థానిక యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించాల్సిన అవసరం ఉందని వివేక్ వెంకటస్వామి, వంశీకృష్ణ కేంద్ర మంత్రికి వివరించారు.
ప్రత్యేకంగా మైనింగ్, మెటల్స్, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ రంగాలకు అనుగుణంగా ఐటీఐ శిక్షణ కోర్సులను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల స్థానిక యువతకు పరిశ్రమలపై ప్రత్యక్ష అవగాహనతోపాటు ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్, అప్రెంటిస్‌షిప్, ఆన్‌ది-జాబ్ ట్రైనింగ్, ప్లేస్‌మెంట్ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
ఒక ITIని హబ్‌గా..
నియోజకవర్గంలోని ఒక ప్రభుత్వ ఐటీఐని PM-SETU హబ్‌గా, ఇతర ఐటీఐలను స్పోక్‌లుగా గుర్తించి క్లస్టర్ విధానంలో అభివృద్ధి చేయాలని కోరారు. ఈ విధానం ద్వారా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్‌ను తయారు చేయడంతోపాటు స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని వివరించారు.
PM-SETU ITI క్లస్టర్ ఏర్పాటుకు NMDCతోపాటు సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య సమన్వయం చేసి అవసరమైన చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామిని కోరారు. వారి విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. పెద్దపల్లి ప్రాంత యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ, అప్రెంటిస్‌షిప్, ఉపాధి అవకాశాలు పెంచేందుకు PM-SETU ITI క్లస్టర్ కీలకంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.





















