రాజస్థాన్,సెప్టెంబర్ 10 (జనవాణి): రాజస్థాన్‌లో మొబైల్ నెట్‌వర్క్ సమస్యపై ఓ యువకుడు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. నెట్‌వర్క్ సిగ్నల్స్ సరిగా రావడం లేదంటూ సెల్‌ఫోన్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. సమస్య పరిష్కరించకపోతే టవర్‌పై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంటానంటూ హెచ్చరించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దీగ్ జిల్లాలోని బేధమ్ గ్రామంలో గత నెల రోజులుగా మొబైల్ నెట్‌వర్క్ సరిగా పనిచేయడం లేదు. దీంతో గ్రామస్థులు ఫోన్ కాల్స్, ఇంటర్నెట్ సేవలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటర్నెట్ సేవలు సక్రమంగా లేకపోవడంతో ఆర్థికంగా కూడా నష్టపోతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పుష్కర్ అనే యువకుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గ్రామం వెలుపల ఉన్న సెల్‌ఫోన్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఎంతగా నచ్చజెప్పినా కిందకు దిగేందుకు నిరాకరించాడు. నెట్‌వర్క్ సమస్య పరిష్కరించే వరకు టవర్ దిగబోనని స్పష్టం చేశాడు. సమస్య పరిష్కారం కాకపోతే కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువకుడిని సురక్షితంగా కిందకు దించేందుకు ప్రయత్నించారు. అయితే నెట్‌వర్క్ సమస్య పరిష్కరించిన తర్వాతే టవర్ దిగుతానని పుష్కర్ పట్టుబట్టాడు. దీంతో పోలీసులు జియో టెక్నికల్ సిబ్బందిని అక్కడికి రప్పించారు. జియో టెక్నికల్ టీమ్ నెట్‌వర్క్ సమస్యను పరిశీలించి పరిష్కరించింది. దాదాపు మూడున్నర గంటల పాటు కొనసాగిన హైడ్రామా అనంతరం పోలీసులు, టెలికాం అధికారులతో మాట్లాడిన పుష్కర్ చివరకు సురక్షితంగా టవర్ నుంచి కిందకు దిగాడు.
ఈ ఘటనపై జిల్లా ఎస్పీ శరణ్ కంబ్లే మాట్లాడుతూ.. మొబైల్ నెట్‌వర్క్ సిగ్నల్స్ సరిగా రావడం లేదని ఓ యువకుడు మొబైల్ టవర్ ఎక్కినట్లు సమాచారం అందిందన్నారు. వెంటనే సదర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకుని యువకుడికి నచ్చజెప్పారని, అతడిని సురక్షితంగా కిందకు దించడంలో పోలీసులు విజయం సాధించారని తెలిపారు.




















