హైదరాబాద్,సెప్టెంబర్ 15 (జనవాణి): హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా నగరానికి నలువైపులా ఆధునిక బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
గాజులరామారం, శంషాబాద్, ఎల్బీనగర్, ఘట్కేసర్ ప్రాంతాల్లో బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేసే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అవసరమైన భూమి కేటాయింపుపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి వెల్లడించారు. గాజులరామారంలో సుమారు 100 ఎకరాలు, శంషాబాద్ వైపు సుమారు 150 ఎకరాల భూమి కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
నగరంలోకి దూరప్రాంత బస్సులకు బ్రేక్
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు వైపు నుంచి హైదరాబాద్‌లోకి వచ్చే దూరప్రాంత, అంతర్‌జిల్లా, అంతర్రాష్ట్ర బస్సులను నగరంలోని ప్రధాన ప్రాంతాల్లోకి రాకుండా నిర్దేశిత టెర్మినల్స్ వరకే నడిపించే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీంతో నగరంలోని ప్రధాన రహదారులపై బస్సుల రాకపోకల ఒత్తిడి తగ్గడంతో పాటు ట్రాఫిక్ రద్దీ, వాహన కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉందన్నారు.
లాస్ట్ మైల్ కనెక్టివిటీపై ఫోకస్
టెర్మినల్స్ వద్ద దిగే ప్రయాణికులు నగరంలోని తమ గమ్యస్థానాలకు సులభంగా చేరుకునేలా లాస్ట్ మైల్ కనెక్టివిటీని బలోపేతం చేయనున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందుకోసం సిటీ ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు, ఎంఎంటీఎస్ సేవలను సమన్వయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అవసరాన్ని బట్టి విమానాశ్రయం వైపు వెళ్లే బస్సులు, అంతర్‌జిల్లా బస్సులను కూడా నిర్దేశిత టెర్మినల్స్ వద్దే నిలిపి.. అక్కడి నుంచి ప్రజా రవాణా సేవల ద్వారా ప్రయాణికులను తరలించే విధానాన్ని అమలు చేయాలని యోచిస్తోంది.
ప్రైవేట్ బస్సులకూ టెర్మినల్స్
హైదరాబాద్‌లో ప్రైవేట్ బస్సులు ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడం, రాత్రి వేళల్లో పెద్ద సంఖ్యలో రోడ్లపైకి రావడం వల్ల ట్రాఫిక్, కాలుష్యం పెరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రైవేట్ బస్సులను కూడా నిర్దేశిత టెర్మినల్స్ నుంచే నిర్వహించే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. టెర్మినల్స్ వినియోగానికి నిబంధనల మేరకు యూజర్ ఛార్జీలు వసూలు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెర్మినల్స్‌లో పార్కింగ్, ప్రయాణికుల వేచి ఉండే ప్రదేశాలు, ఇతర ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.
2,200 ఎలక్ట్రిక్ బస్సులతో మెరుగైన కనెక్టివిటీ
హైదరాబాద్ ప్రజా రవాణాను మరింత బలోపేతం చేసేందుకు రానున్న 2,200 ఎలక్ట్రిక్ బస్సులను సమర్థవంతంగా వినియోగించనున్నట్లు మంత్రి తెలిపారు. టెర్మినల్స్ నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణికులు సులభంగా చేరుకునేలా కొత్త రూట్లను రూపొందించనున్నట్లు చెప్పారు. టెర్మినల్ ఆధారిత ప్రజా రవాణా వ్యవస్థతో నగరంలోకి వచ్చే దూరప్రాంత బస్సుల సంఖ్యను నియంత్రించడంతో పాటు.. ప్రయాణికులకు సిటీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్ వంటి ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను అందుబాటులోకి తీసుకురావచ్చన్నారు.
హైదరాబాద్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రజా రవాణా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. నగర శివార్లలో టెర్మినల్స్ ఏర్పాటు చేసి, అక్కడి నుంచి సమర్థవంతమైన ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ట్రాఫిక్ రద్దీ, కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు హైదరాబాద్‌ను మరింత సుస్థిరమైన ప్రజా రవాణా నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.




















