సిరిసిల్ల, జూలై 30: రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పెద్దబజార్‌లో గురువారం భారీ వేపచెట్టు ఒక్కసారిగా నేలకూలింది. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న మినీ వ్యాన్‌పై చెట్టు పడటంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామానికి చెందిన అరుకుటి రాజు తన మినీ వ్యాన్‌లో కలెక్టరేట్‌కు వెళ్తున్నాడు. గాంధీ చౌరస్తా నుంచి పెద్దబజార్ మీదుగా ప్రయాణిస్తుండగా, హనుమాన్ ఆలయం సమీపానికి చేరుకోగానే రోడ్డుపక్కన ఉన్న భారీ వేపచెట్టు ఒక్కసారిగా విరిగి వ్యాన్‌పై పడింది. ఈ ప్రమాదంలో రాజు తలకు గాయాలయ్యాయి.

ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన రాజును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై అడ్డంగా పడిన చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించే పనులు చేపట్టారు.
స్థానిక కౌన్సిలర్ అటుచెర్ల సాయికృష్ణ మాట్లాడుతూ.. వర్షాల కారణంగా పాత వృక్షాలు ప్రమాదకరంగా మారాయని, హనుమాన్ ఆలయం, విమల్ థియేటర్ పరిసరాల్లో ఉన్న భారీ చెట్లను వెంటనే పరిశీలించి అవసరమైతే తొలగించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. పెద్దబజార్ ప్రాంతంలో ప్రమాదకరంగా ఉన్న చెట్ల తొలగింపుపై గతంలో పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.




















