హైదరాబాద్, సెప్టెంబర్ 8 (జనవాణి): తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఎమ్మెల్సీలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.
సోమవారం తెలంగాణ అసెంబ్లీ ముట్టడి సందర్భంగా స్పీకర్‌ను కులం పేరుతో దూషించడంతో పాటు అసభ్య పదజాలం ఉపయోగించారంటూ స్పీకర్ ఓఎస్డీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తాతా మధును, కోకాపేటలోని ఆయన నివాసంలో నవీన్ కుమార్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
రిమాండ్‌ను వ్యతిరేకించిన బీఆర్ఎస్ లీగల్ టీమ్
పోలీసులు కోరిన రిమాండ్‌ను బీఆర్ఎస్ న్యాయవాదుల బృందం తీవ్రంగా వ్యతిరేకించింది. సోమవారం అసెంబ్లీ వద్ద చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన దృశ్యాలను కోర్టు ముందు ఉంచింది. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కేసులు నమోదు చేశారని, అరెస్ట్ సమయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు, అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన న్యాయమూర్తి.. పోలీసుల రిమాండ్ అభ్యర్థనను తిరస్కరించారు.
జడ్జి నివాసం వద్ద హైడ్రామా
అరెస్టైన ఎమ్మెల్సీలను పోలీసులు నేరుగా జడ్జి నివాసానికి తీసుకెళ్లడంపై బీఆర్ఎస్ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్సీలను కోర్టుకు తీసుకురావాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. అనంతరం కోర్టులో విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఒక్కొక్కరికి రూ.10 వేల పూచీకత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. అనంతరం ఇద్దరు ఎమ్మెల్సీలను వెంటనే విడుదల చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిల విడుదల ప్రక్రియ ప్రారంభమైంది.




















