రూ.1.10 కోట్లతో వేములవాడ ఆర్టీసీ బస్టాండ్ ఆధునికీకరణ.. అభివృద్ధి పనులకు మంత్రులు పొన్నం, తుమ్మల శంకుస్థాపన

దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న క్షేత్రంలో రూ.1.10 కోట్లతో ఆర్టీసీ బస్టాండ్‌ అభివృద్ధి పనులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం శంకుస్థాపన చేశారు.

30 జులై, 2026 12:45 PM•ByRamchandram

Share this article

రూ.1.10 కోట్లతో వేములవాడ ఆర్టీసీ బస్టాండ్ ఆధునికీకరణ.. అభివృద్ధి పనులకు మంత్రులు పొన్నం, తుమ్మల శంకుస్థాపన

వేములవాడ, జూలై 30: దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న క్షేత్రంలో రూ.1.10 కోట్లతో ఆర్టీసీ బస్టాండ్‌ అభివృద్ధి పనులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం శంకుస్థాపన చేశారు. అంతకుముందు సిరిసిల్ల కలెక్టరేట్ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన జోటా, చేనేత, మరమగ్గాల ప్రతిమలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, సంజయ్ కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణ, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేసినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో సిబ్బందిని పెంచడమే కాకుండా కొత్త బస్సు రూట్లను ప్రారంభించి ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందిస్తున్నామని చెప్పారు.

గతంలో వేములవాడ ఆర్టీసీ బస్టాండ్‌ను తొలగిస్తామని ప్రకటించినప్పుడు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి తాము పోరాటం చేశామని గుర్తు చేశారు. 1984లో నిర్మించిన ఈ బస్టాండ్‌కు ఇప్పటివరకు పెద్దగా అభివృద్ధి జరగలేదన్నారు. రాజన్న ఆలయానికి ప్రతిరోజూ సుమారు 250 బస్సులు, 500 ట్రిప్పుల ద్వారా వేలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రూ.1.10 కోట్లతో బస్టాండ్‌ను ఆధునికీకరిస్తున్నామని వివరించారు.

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వర్షాలు ప్రస్తుతం కురుస్తున్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆగస్టు నెలాఖరు వరకు చేతికి వచ్చే పంటలనే సాగు చేయాలని రైతులకు సూచించారు.

దేశంలోనే అతిపెద్ద ప్రజారవాణా సంస్థల్లో ఒకటైన తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వం నూతన విధానాలతో బలోపేతం చేస్తోందని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశపెట్టడంతో పాటు పలు సంస్కరణలు చేపట్టినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వేములవాడ, బాసర వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలను సందర్శిస్తున్నారని, రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల వద్ద ఉన్న ఆర్టీసీ బస్టాండ్లన్నింటినీ దశలవారీగా ఆధునికీకరించి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.

R

Written By

Ramchandram

Newsroom Staff

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు