అనకాపల్లి,అక్టోబర్ 1 (జనవాణి): టాలీవుడ్‌లో స్టార్ హీరోలకు అభిమానులు ఉండటం సాధారణమే. కానీ కొందరి అభిమానం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమాని చెప్పిన ఓ ఆసక్తికరమైన సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభాస్ సినిమా టికెట్ దొరకలేదనే కారణంతో ఓ థియేటర్‌ను కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
అనకాపల్లికి చెందిన వ్యాపారవేత్త కాండ్రేగుల నాయుడు ప్రస్తుతం నిర్మాతగా మారారు. ఆయన నిర్మించిన ‘అనకాపల్లి’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తనకు ప్రభాస్‌పై ఉన్న అభిమానం గురించి నాయుడు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
‘మిర్చి’ సినిమా సమయంలో టికెట్ దొరకలేదట!
తాను మొదటి నుంచీ ప్రభాస్ అభిమానినని నాయుడు తెలిపారు. ప్రభాస్ సినిమా విడుదలైతే కుటుంబం మొత్తం కలిసి థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తామని చెప్పారు. ఈ క్రమంలో ప్రభాస్ నటించిన ‘మిర్చి’ సినిమా విడుదలైన సమయంలోనూ కుటుంబంతో కలిసి థియేటర్‌కు వెళ్లారట. అయితే అప్పటికే థియేటర్ పూర్తిగా నిండిపోవడంతో టికెట్లు దొరకలేదని నాయుడు గుర్తుచేసుకున్నారు. టికెట్ కోసం మధ్యాహ్నం మొత్తం థియేటర్ వద్దే ఉండి ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని తెలిపారు.
టికెట్ దొరకలేదని థియేటర్ కొనాలని ఫిక్స్!
ఆ సమయంలోనే తనకు ఓ ఆలోచన వచ్చిందని నాయుడు చెప్పారు. ఎప్పటికైనా అదే థియేటర్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఆ ఆలోచనను అక్కడితో వదిలేయకుండా అనుకున్నట్లుగానే అనకాపల్లిలోని వెంకటేశ్వర థియేటర్‌ను కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే తాను నిర్మాతగా మారి నిర్మించిన ‘అనకాపల్లి’ సినిమాను అదే థియేటర్‌లో విడుదల చేస్తున్నట్లు నాయుడు వెల్లడించారు.
ప్రభాస్ సినిమా టికెట్ దొరకక మొదలైన ఓ చిన్న సంఘటన చివరకు థియేటర్ కొనుగోలు చేసేంత పెద్ద నిర్ణయంగా మారింది. నాయుడు చెప్పిన ఈ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా స్పందిస్తున్నారు. అభిమానం ఉంటే ఇలా కూడా ఉంటుందా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.




















