హన్మకొండ, జులై 30: పేద విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందించే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు నిరసనగా ABVP ఆధ్వర్యంలో జులై 30వ తేదీన హన్మకొండలో తలపెట్టిన "స్టూడెంట్ మార్చ్"ను విజయవంతం చేయవలసిందిగా ABVP రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు తెలిపారు.
ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ" తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల మంది SC,ST,BC,EBC,మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ఆధారపడి చదువుకుంటున్నారని, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేస్తే విద్యార్థుల జీవితాలు నాశనం అవుతాయని,పేదవాడికి ఇంజనీరింగ్, మెడిసిన్, లా వంటి చదువులు అందని ద్రాక్షగా మిగులుతాయన్నారు.ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా అనేక పేద కుటుంబాలు ఆర్థికంగా,సామాజికంగా ఉన్నతంగా ఎదిగాయన్నారు.ప్రభుత్వం సరైన సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయని కారణంగా 11000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రతి యేట 2 లక్షల మంది విద్యార్థులు డ్రాపౌట్ అవుతున్నారని, విద్యార్థులు సర్టిఫికెట్స్ తీసుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.ఇక్కడి విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వలసవెళ్లే పరిస్థితి దాపురించిందన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తుంగలో తొక్కుతూ పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నదని, మా ప్రభుత్వంలో బకాయిలు చెల్లించడంతో పాటుగా, గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి ప్రతి నెల ఫీజులు చెల్లిస్తామని చెప్పిన నేటి ముఖ్యమంత్రి తానే విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఈ విషయం కోర్టు మెట్లు ఎక్కిందనీ అన్నారు.
ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వం కలిసి ఆడుతున్న నాటకంలో విద్యార్థులు బలి అవుతున్నారని, బడ్జెట్ కాలేజిలు సైతం మూతపడుతున్నాయని, పొట్టకూటి కోసం లెక్చరర్ గా మారిన నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని దీనికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే అన్నారు. రీయింబర్స్ మెంట్ , స్కాలర్షిప్స్ అనేవి విద్యార్థుల హక్కు అని ప్రభుత్వం వేసే బిక్ష కాదన్నారు. రీయింబర్స్ మెంట్ కోసం అడిగితే విద్యార్థులపై పోలీసులచే ప్రభుత్వం జులుం చూపిస్తున్నదని, నిరసన చేస్తే లాఠీచార్జీలు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని, కానీ తెలంగాణ విద్యార్థులకు ఇవి కొత్తేమీ కాదన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పారని ఇప్పటికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ప్రభుత్వం కళ్ళు తెరవాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. మానవవనరులను తయారుచేసే విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ఘనత రేవంత్ రెడ్డిదేనని, కమిషన్లకు అలవాటు పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు రావనే బకాయిలు విడుదల చేయట్లేదని అన్నారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బాధిత విద్యార్థుల మరణాలకు,గురుకులాల్లో విద్యార్థుల మరణాలకు భాధ్యత వహించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీకు చేతనైతలేదు గనుక నీ మంత్రివర్గంలో Gen Z కి విద్యాశాఖ మంత్రి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని కళాశాల ప్రాంగణాలు, విశ్వవిద్యాలయాలు మరోసారి ఉద్యమ వేదికలై రేవంత్ రెడ్డిని రాజకీయంగా సమాధి చేస్తాయని,పేద విద్యార్థులను చదువులకు దూరం చేస్తూ రాక్షసానందం పొందుతున్న రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలకు సిద్ధం కావాలని,ABVP ఆధ్వర్యంలో భవిష్యత్ లో చేపట్టబోయే ఉద్యమాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు,మేధావులు, సబ్బండ వర్గాలు భాగం కావాలని పిలుపునిచ్చారు. జులై 30న హన్మకొండలో చేపట్టబోయే స్టూడెంట్ మార్చ్ తో రేవంత్ రెడ్డికి విద్యార్థుల సత్తా చూపిస్తామని, ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహించబోయే "స్టూడెంట్ మార్చ్" ను అక్రమ అరెస్టులు,అనుమతి నిరాకరణతో ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తే తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే భాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని,సమస్యల పరిష్కారంలో మీనమేషాలు లెక్కిస్తే ప్రజాఉద్యమంలో కొట్టుకుపోకతప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జూపల్లి దీపిక , వరంగల్ విభాగ్ కన్వీనర్ ఆరెపల్లి సుజిత్, సిద్దు, కృష్ణ, బన్నీ తదితరులు పాల్గొన్నారు




















