ఏటీసీలో శిక్షణతో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి

తెలంగాణలో వచ్చే ఏడాది నుంచి 119 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో స్కిల్ కాంపిటిషన్స్ నిర్వహించనున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. టాప్-10 ఇన్నోవేటర్లకు అవార్డులు, ప్రోత్సాహకాలు, ఉద్యోగావకాశాలు కల్పిస్తామని వెల్లడించారు.

18 ఆగస్టు, 2026 7:57 PM•ByVijay Kumar

Share this article

ఏటీసీలో శిక్షణతో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి

జనవాణి: మణుగూరు, ఆగస్టు 18: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దూరదృష్టితో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీలు) యువతకు కేవలం ఉద్యోగ శిక్షణ అందించే కేంద్రాలుగా కాకుండా.. వారిలోని సృజనాత్మకతను వెలికితీసి ఇన్నోవేటర్లుగా తీర్చిదిద్దే వేదికలుగా మారుతున్నాయని శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీస్) మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్‌ జి. వివేక్‌ వెంకటస్వామి అన్నారు. పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు ఏటీసీల్లో రెండేళ్ల శిక్షణతోనే విద్యుత్‌ వాహనాలను తయారు చేయడం రాష్ట్రంలోని నైపుణ్య శిక్షణ వ్యవస్థకు నిదర్శనమని తెలిపారు.

మణుగూరులోని అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ను సందర్శించిన మంత్రి డాక్టర్‌ జి. వివేక్‌ వెంకటస్వామి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ను మంత్రి మంగళవారం సందర్శించారు. ఏటీసీ విద్యార్థులు పార్థసారథి, స్ఫూర్తి రూపొందించిన వినూత్న విద్యుత్‌ వాహనాలను పరిశీలించి వారి ప్రతిభను అభినందించారు. విద్యార్థులతో మాట్లాడి ఆవిష్కరణలకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మణుగూరు ఏటీసీలో శిక్షణ పూర్తి చేసి వివిధ సంస్థల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు.

రాష్ట్రంలోని ఏటీసీల్లో చదివే ప్రతి విద్యార్థికి నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన స్కిల్‌ సెట్లను యువతకు అందిస్తూ.. మరోవైపు విద్యార్థుల్లోని సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.

ఏటీసీల్లో శిక్షణ పొందిన విద్యార్థులు ఉద్యోగాలకే పరిమితం కాకుండా కొత్త ఆవిష్కరణలు చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మణుగూరు ఏటీసీ విద్యార్థుల ఆవిష్కరణలు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

ఏటీసీల్లో వచ్చే ఏడాది నుంచి స్కిల్ కాంపిటేషన్స్

వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో ఏర్పాటయ్యే 119 అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లలో ప్రతి ఏటా స్కిల్‌ కాంపిటిషన్‌ నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు. ఏటీసీల మధ్య పోటీలు నిర్వహించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచే ఇన్నోవేటర్లను గుర్తిస్తామని తెలిపారు.

టాప్‌–10 ఇన్నోవేటర్లకు ఉద్యోగాలు, ప్రోత్సాహకాలు

టాప్‌–10లో నిలిచే ఇన్నోవేటర్లకు ప్రత్యేక అవార్డులు, ప్రోత్సాహకాలు అందించడంతో పాటు ఏటీసీల్లోనే ఉద్యోగావకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థులు తమ ఆలోచనలను ఆవిష్కరణలుగా మార్చి ప్రపంచస్థాయిలో పోటీపడేలా ప్రోత్సహిస్తామని తెలిపారు.

విద్యార్థులు రూపొందించిన విద్యుత్‌ వాహనాలు తనను ఎంతగానో ఆకట్టుకుంన్నాయి - మంత్రి

పదో తరగతి తర్వాత ఏటీసీలో చేరిన విద్యార్థులు కేవలం రెండేళ్లలోనే విద్యుత్‌ వాహనాలను అభివృద్ధి చేయడం తనను ఎంతగానో ఆకట్టుకుందని మంత్రి అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సాంకేతిక విద్యాసంస్థల్లో ఇలాంటి ఆవిష్కరణలు దరావడం గర్వకారణమన్నారు.

విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలను కేవలం ప్రదర్శనలకే పరిమితం చేయకుండా వాణిజ్య స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. విద్యుత్‌ వాహనాలను మరింత అభివృద్ధి చేసి మార్కెట్‌లోకి తీసుకెళ్లేందుకు అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు.

విద్యార్థులు మరింత మెరుగైన నమూనాలను అభివృద్ధి చేయాలని సూచించారు. అవసరమైన నిధుల కోసం ప్రభుత్వ సహకారం అందిస్తామని తెలిపారు. తక్కువ వ్యయంతో తయారు చేస్తున్న విద్యుత్‌ వాహనాలకు మార్కెట్‌ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా 119 ఏటీసీలను టాటా సంస్థ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణలో టాటా సంస్థ సుమారు రూ.4 వేల కోట్ల పెట్టుబడితో సాంకేతిక శిక్షణ కేంద్రాల అభివృద్ధికి సహకరిస్తోందని చెప్పారు.

ఏటీసీల్లో ఆధునిక కోర్సులు

పరిశ్రమల్లో మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా కొత్త కరిక్యులమ్‌, ఆధునిక కోర్సులను ఏటీసీల్లో ప్రవేశపెడుతున్నామని తెలిపారు. పాత ఐటీఐల్లో అందుబాటులో ఉన్న కోర్సులు పరిశ్రమల అవసరాలకు సరిపోకపోవడం వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గాయని పేర్కొన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏటీసీలను తీర్చిదిద్దుతున్నామని వివరించారు.

100 మందికి టాటా సంస్థలో ఉద్యోగావకాశాలు

మణుగూరు ఏటీసీలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల్లో 100 మందికి టాటా సంస్థలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని సంస్థ ప్రతినిధులు హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు.

మారుమూల, గిరిజన ప్రాంతాల్లోని యువతకు ఏటీసీలు ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయని చెప్పారు. ఇలాంటి ప్రాంతాల్లో శిక్షణ పొందిన యువతకు స్థానికంగానే కాకుండా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు పొందే అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

తెలంగాణ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. టామ్‌కామ్‌ ద్వారా విదేశీ ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.90 కోట్లు కేటాయించిందని చెప్పారు.

జర్మన్‌, జపనీస్‌ భాషల్లో శిక్షణ

జర్మన్‌, జపనీస్‌ వంటి విదేశీ భాషల్లో శిక్షణ ఇచ్చి జర్మనీ, జపాన్‌ తదితర దేశాల్లో ఉద్యోగాలు పొందేలా యువతను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. విదేశాల్లోని సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకుని ఉద్యోగ అవకాశాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని వివరించారు.

మణుగూరు ప్రాంతానికి చెందిన యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటుపై దృష్టి సారిస్తామని మంత్రి తెలిపారు. ఐటీసీ సంస్థ సీఎస్‌ఆర్‌ నిధులతో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

మొదటి దశలో 100 మంది యువతను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వాలని సూచించారు. జర్మన్‌ భాషతో పాటు పరిశ్రమలకు అవసరమైన ఇతర నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పించి వారికి ఉద్యోగాలు కల్పించేలా అధికారులు, పరిశ్రమలు కలిసి పనిచేయాలని అన్నారు.

విద్యార్థులకు నెలకు రూ.2 వేల స్టైఫండ్‌

ఏటీసీల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు నెలకు రూ.2 వేల స్టైఫండ్‌ అందించనున్నట్లు మంత్రి తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్యార్థులు శిక్షణకు దూరం కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. విద్యార్థులు పూర్తిస్థాయిలో శిక్షణపై దృష్టి పెట్టి మంచి ఉద్యోగాలు పొందాలని సూచించారు.

ఏటీసీల్లో విద్యార్థులకు ఉచిత అల్పాహారం అందించే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా తెలంగాణలో విద్యార్థుల సంక్షేమంతో పాటు నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.

యువతకు ఉపాధి

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు పరిశ్రమలు, నైపుణ్య శిక్షణ సంస్థలు, విదేశీ ఉద్యోగ అవకాశాల ద్వారా యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఉపాధి కల్పనలో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, రానున్న కాలంలో మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు.

ఉద్యోగ, నైపుణ్య శిక్షణతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి అన్నారు. ఆరు గ్యారెంటీల అమలుతో పాటు ఉచిత విద్యుత్‌, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.

యువతకు స్ఫూర్తి

మణుగూరు ఏటీసీ విద్యార్థుల ఆవిష్కరణలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువతకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి ఒక నైపుణ్యాన్ని నేర్చుకుని, ఒక ఆవిష్కరణకు శ్రీకారం చుట్టి, మంచి ఉద్యోగాన్ని సాధించి తన కుటుంబానికి అండగా నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు.

కార్లు తయారు చేసిన పార్థసారథి, స్ఫూర్తికి ప్రశంసా పత్రాలు అందజేత

పాత, రీసైకిల్‌ చేసిన విడిభాగాలను ఉపయోగించి సుమారు రూ.45 వేల వ్యయంతో విద్యుత్‌ కారును స్ఫూర్తి అనే విద్యార్థిని రూపొందించారు. పులిపాటి పార్థసారథి ప్రయాణికుల రవాణాతో పాటు సరుకు రవాణాకు ఉపయోగపడే విద్యుత్‌ వాహనాన్ని సుమారు రూ.1.60 లక్షల వ్యయంతో అభివృద్ధి చేశారు.

కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ అంకిత్, ఉపాధి శిక్షణ శాఖ జాయింట్ డైరెక్టర్ నగేశ్, రీజినల్ డైరెక్టర్ రాజా, డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఇతర అధికారులు, ఏటీసీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు