మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి తీవ్ర గుండెపోటు.. యశోద ఆస్పత్రిలో చికిత్స

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల క్రితమే యశోద హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్న ఆయనకు ఆదివారం హనుమకొండలోని ఇంట్లో ఉదయం ఏడు గంటలకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది.

27 జులై, 2026 1:39 PM•ByNarender Kumar Nangunoori

Share this article

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి తీవ్ర గుండెపోటు.. యశోద ఆస్పత్రిలో చికిత్స

హనుమకొండ, హైదరాబాద్‌, జూలై 26: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం హనుమకొండలోని తన నివాసంలో ఆయనకు అకస్మాత్తుగా తీవ్రమైన గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హనుమకొండలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రికి చేరేసరికి ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో కార్డియాలజిస్ట్ డాక్టర్ మమతారెడ్డి నేతృత్వంలోని వైద్య బృందం అత్యవసర చికిత్స ప్రారంభించింది. వైద్యుల సమాచారం ప్రకారం, ఉదయం 8 గంటల నుంచి సుమారు గంటపాటు ఎనిమిది సార్లు సీపీఆర్ చేసినప్పటికీ పెద్దగా స్పందన కనిపించలేదు. అయినప్పటికీ ఆశ వదలకుండా తొమ్మిదోసారి సీపీఆర్ నిర్వహించగా గుండె మళ్లీ స్పందించడం వైద్యులకే ఆశ్చర్యాన్ని కలిగించింది. దీనిని వైద్యులు "మెడికల్ మిరాకిల్"గా అభివర్ణించారు.

పరీక్షల్లో గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే మార్గంలో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించిన వైద్యులు వెంటనే ప్రత్యేక ఇంజెక్షన్ ఇచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిపుణుల వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.

ఈ విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ అధినేత కేసీఆర్‌కు సమాచారం అందించి హుటాహుటిన హనుమకొండకు చేరుకుని సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన భార్య స్వప్నకు ధైర్యం చెప్పడంతో పాటు పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

అనంతరం వైద్యులతో మాట్లాడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. హైదరాబాద్‌కు త్వరగా తరలించేందుకు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో సమన్వయం చేసి ప్రత్యేక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత ఆధ్వర్యంలో అంబులెన్స్‌కు పోలీసు ఎస్కార్ట్ కల్పించడంతో కేవలం గంటా నలభై నిమిషాల్లో యశోద ఆస్పత్రికి చేరుకోగలిగారు.

ఇక ఈ ఘటనలో డాక్టర్ మమతారెడ్డి సేవలకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. క్లిష్ట పరిస్థితుల్లో కూడా పట్టుదలతో చికిత్స కొనసాగించి సుదర్శన్‌రెడ్డి గుండె స్పందించేలా చేసిన ఆమె వైద్య నైపుణ్యాన్ని పలువురు కొనియాడుతున్నారు. ఇటీవల మరో మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు ప్రాణాలను కూడా అత్యవసర చికిత్సతో కాపాడిన డాక్టర్ మమతారెడ్డి సేవలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా సామాజిక మాధ్యమం ద్వారా స్పందిస్తూ, అత్యంత క్లిష్ట సమయంలో అసాధారణ అంకితభావంతో వైద్యం అందించిన డాక్టర్ మమతారెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆమె సేవలు వైద్య వృత్తికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని యశోద ఆస్పత్రి నిపుణుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తుండగా, ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, పార్టీ నాయకులు, ప్రజలు ప్రార్థిస్తున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు