హైదరాబాద్, జులై 28: ఇటీవల గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డిని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవరెడ్డి కలిసి పరామర్శించారు.
ఆసుపత్రికి చేరుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా జీవితంలోకి తిరిగి రావాలని ఆకాంక్షించారు.
అనంతరం సుదర్శన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుని మాజీ ఎమ్మెల్యే ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షించారు.




















