మహిళల భద్రతకు 'పోలీస్ అక్క' సేవలు: సూర్యాపేట ఎస్పీ

తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో నిర్వహించిన 'పోలీస్ ప్రజా భరోసా' కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహ ప్రజలకు భద్రత, సైబర్ నేరాలు, గంజాయి నిర్మూలన, మహిళల రక్షణపై అవగాహన కల్పించారు.

23 జులై, 2026 3:17 PM•ByGovardhan Reddy

Share this article

మహిళల భద్రతకు 'పోలీస్ అక్క' సేవలు: సూర్యాపేట ఎస్పీ

సూర్యాపేట (తెలంగాణ), జూలై 22: తెలంగాణలోని సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి బుధవారం నిర్వహిస్తున్న 'పోలీస్ ప్రజా భరోసా' కార్యక్రమంలో భాగంగా బుధవారం గోపాలపురం కాలనీలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై కాలనీ వాసులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల వద్దకే పోలీసు సేవలను తీసుకెళ్లి భద్రతపై భరోసా కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. మహిళలు, బాలికల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి పోలీస్ స్టేషన్‌లో 'పోలీస్ అక్క'ను నియమించి బాధిత మహిళలకు అండగా నిలుస్తున్నామని చెప్పారు.

ప్రజల భద్రత కోసం పోలీసులు రాత్రింబవళ్లు గస్తీ నిర్వహిస్తూ కాలనీలు, గ్రామాల్లో నిఘా పెంచుతున్నామని తెలిపారు. యువత నేరాలకు పాల్పడితే భవిష్యత్తులో ఉద్యోగాలు, విదేశీ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించారు. ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాల నియంత్రణకు ప్రజలు సహకరించాలని కోరారు.

జిల్లా కేంద్రంలోని సుమారు 600 సీసీ కెమెరాలను పోలీస్ పర్యవేక్షణ వ్యవస్థతో అనుసంధానం చేసి నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని ఎస్పీ తెలిపారు. వృద్ధుల భద్రత కోసం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సీనియర్ సిటిజన్ భద్రత కమిటీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

సైబర్ మోసాలు, రోడ్డు భద్రత, గంజాయి నిర్మూలన, సోషల్ మీడియా ప్రభావం, సీసీ కెమెరాల అవసరం, వృద్ధుల సంక్షేమం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్లు, సందేశాలను నమ్మి బ్యాంకు వివరాలు లేదా వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, గంజాయి లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాల సమాచారం తెలిసినా వెంటనే డయల్-100 లేదా 112కు సమాచారం అందించాలని కోరారు.

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం నిర్వహిస్తున్న 'అరైవ్ అలైవ్' కార్యక్రమం గురించి వివరిస్తూ, అతివేగం ప్రాణాంతకమని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

కార్యక్రమంలో షీ టీమ్ సభ్యులు, పోలీస్ కళా బృందం ఆటపాటల ద్వారా మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలు, పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలను ప్రజలకు వివరించారు.

ఈ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, 36వ వార్డు కౌన్సిలర్ మన్సూర్ బి. ఫారూక్, ఎస్‌ఐలు యాదవేందర్ రెడ్డి, కనకరత్నం, షీ టీమ్ ఎస్‌ఐ నీలిమ, పోలీస్ సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు