జనవాణి: ఛత్తీస్‌గఢ్ Aug 11 : రేషన్ కోసం ఇక నిర్ణీత సమయం వరకు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఛత్తీస్‌గఢ్‌లో 24 గంటలూ పనిచేసే ‘అన్నపూర్తి గ్రెయిన్ ఏటీఎం’ను ప్రారంభించారు. బయోమెట్రిక్ ధ్రువీకరణతో ఆటోమేటిక్‌గా ధాన్యం పంపిణీ చేసే ఈ వ్యవస్థ ద్వారా పని చేసే మహిళలు, వలస కార్మికులు, ఇతర లబ్ధిదారులకు మరింత సౌకర్యవంతంగా ఆహార భద్రత అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
టెక్నాలజీతో రేషన్ పంపిణీ
ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత స్మార్ట్‌గా, పారదర్శకంగా మార్చే దిశగా ‘అన్నపూర్తి గ్రెయిన్ ఏటీఎం’ను అందుబాటులోకి తీసుకొచ్చారు. సాధారణ రేషన్ దుకాణాల్లో ఉండే ప్రక్రియకు భిన్నంగా.. బయోమెట్రిక్ ధ్రువీకరణ అనంతరం ఆటోమేటెడ్ డిస్పెన్సింగ్ విధానం ద్వారా ధాన్యాన్ని అందిస్తుంది.
24 గంటల సేవలు
ఈ గ్రెయిన్ ఏటీఎం 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. దీంతో ఉద్యోగాలు, ఇతర పనుల కారణంగా సాధారణ రేషన్ దుకాణాల సమయాల్లో వెళ్లలేని లబ్ధిదారులకు ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా పని చేసే మహిళలు, వలస కార్మికులకు ఈ సౌకర్యం ఉపయోగపడుతుందని ప్రభుత్వం పేర్కొంది.
వన్ నేషన్.. వన్ రేషన్ కార్డు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘వన్ నేషన్, వన్ రేషన్ కార్డు’ వ్యవస్థతో అనుసంధానమైన ఆహార భద్రత లక్ష్యాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దేశంలో ఎక్కడ ఉన్నా అర్హులైన లబ్ధిదారులకు రేషన్ ప్రయోజనాలు అందేలా సాంకేతికతను వినియోగించడమే ఈ విధానంలోని ప్రధాన ఉద్దేశం.
అంత్యోదయ లక్ష్యానికి మరో అడుగు
ఆహార భద్రతను కేవలం సంక్షేమ పథకంగా కాకుండా.. ప్రజలకు గౌరవం, సౌకర్యంతో అందించాలన్న లక్ష్యంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రతి అర్హుడికి ఆహార భద్రత ప్రయోజనాలు చేరేలా ‘అంత్యోదయ’ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నట్లు పేర్కొంది.
Loading Tweet...




















