Collegium | హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం అనుసరిస్తున్న విధానంపై సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తుల ఎంపికకు సంబంధించి కొలీజియం తన సిఫార్సుల్లో కారణాలు వెల్లడించకపోవడం పారదర్శకత సూత్రాలకు విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, సమర్థంగా పనిచేసిన పలువురు న్యాయమూర్తులకు ఇది అన్యాయం చేసే పరిస్థితిని తీసుకొస్తోందని పేర్కొన్నారు. న్యాయ పరిశోధనా సంస్థ ‘విధి’ విడుదల చేసిన ఓ నివేదిక ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన జస్టిస్ భుయాన్.. ఇటీవల కొలీజియం చేసిన మూడు సిఫార్సుల్లోనూ ఎంపికకు గల కారణాలను ఎక్కడా ప్రస్తావించలేదని గుర్తుచేశారు. కారణాలు వెల్లడించకపోవడం పారదర్శకత సూత్రం నుంచి వైదొలగడమే కాదా? అని ఆయన ప్రశ్నించారు.
గత సిఫార్సుల్లోనూ ఇదే ధోరణి
న్యాయమూర్తుల నియామకాలు, పదోన్నతులకు గల కారణాలను వెల్లడించకపోవడం వల్ల అర్హత లేని వ్యక్తులు కూడా న్యాయవ్యవస్థలోకి వచ్చే అవకాశం ఉంటుందని జస్టిస్ భుయాన్ వ్యాఖ్యానించారు. గతంలో కొలీజియం చేసిన సిఫార్సులను పరిశీలించినా ఇదే విధానం కొనసాగుతున్నట్లు కనిపిస్తోందని తెలిపారు. న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టాలంటే, రాజ్యాంగ విలువలకు విరుద్ధమైన ఆలోచనలు కలిగిన వ్యక్తులు వ్యవస్థలోకి ప్రవేశించకుండా చూడాలంటే కొలీజియం సిఫార్సులపై బహిరంగ చర్చ జరగాల్సిన అవసరం ఉందని జస్టిస్ భుయాన్ అన్నారు. ఎంపికలకు కారణాలు వెల్లడించకపోవడం వల్ల నిజంగా ప్రతిభ కలిగిన పలువురు న్యాయమూర్తులకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
గత దశాబ్దంలో న్యాయవ్యవస్థలో చోటుచేసుకున్న అత్యంత పారదర్శకమైన సంస్కరణ.. కోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారమేనని జస్టిస్ భుయాన్ అభిప్రాయపడ్డారు. కోర్టు ప్రక్రియలు ప్రజలకు అందుబాటులో ఉండటం అత్యంత కీలకమని, దీనివల్ల న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం మరింత బలపడుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే, కొలీజియం వ్యవస్థలపై వచ్చే విమర్శలపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ గతంలోనే స్పందించారు. సుప్రీంకోర్టు, హైకోర్టులకు న్యాయమూర్తులను సిఫారసు చేసే సమయంలో కేవలం వారి పనితీరు, న్యాయమూర్తిగా అందించిన సేవలతో పాటు గతంలో వారు నిర్వహించిన బాధ్యతలు, వృత్తిపరమైన అనుభవం వంటి అనేక అంశాల్ని పరిశీలించాక కొలీజియం తుది నిర్ణయం తీసుకొని సిఫారసు చేస్తుందని ఆయన క్లారిటీ ఇచ్చారు.




















