తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు బిగ్ షాక్..

తెహల్కా మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌కు బాంబే హైకోర్టు గోవా బెంచ్‌లో ఎదురుదెబ్బ తగిలింది. 2013 లైంగిక దాడి కేసులో సెషన్స్ కోర్టు ఇచ్చిన నిర్దోషిత్వ తీర్పును రద్దు చేసి తేజ్‌పాల్‌ను దోషిగా తేల్చింది. శిక్షపై ప్రత్యేకంగా విచారణ జరగనుంది.

6 ఆగస్టు, 2026 12:27 PM•ByLaharika

Share this article

తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు బిగ్ షాక్..

పనాజీ, ఆగస్టు 6 (జనవాణి): తెహల్కా మ్యాగజైన్ మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌కు బాంబే హైకోర్టు గోవా బెంచ్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2013లో తన జూనియర్ సహోద్యోగిపై లైంగిక దాడికి సంబంధించిన కేసులో తేజ్‌పాల్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ 2021లో మపుసా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు గురువారం రద్దు చేసింది. గోవా ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను అనుమతించిన ధర్మాసనం తేజ్‌పాల్‌ను దోషిగా తేల్చింది.

13 ఏళ్ల నాటి కేసులో కీలక మలుపు

2013 నవంబర్‌లో గోవాలో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా తన జూనియర్ మహిళా సహోద్యోగిపై తేజ్‌పాల్ లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో కేసు నమోదైంది. ఈ కేసు దేశవ్యాప్తంగా అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సుదీర్ఘ విచారణ అనంతరం 2021 మేలో మపుసా సెషన్స్ కోర్టు తేజ్‌పాల్‌ను అన్ని ఆరోపణల నుంచి నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ గోవా ప్రభుత్వం బాంబే హైకోర్టును ఆశ్రయించింది.

నిర్దోషిత్వ తీర్పును రద్దు చేసిన హైకోర్టు

గోవా ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ జరిపిన జస్టిస్ డాక్టర్ నీలా గోఖలే, జస్టిస్ అమిత్ జంసాండేకర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ సెషన్స్ కోర్టు తీర్పును పక్కనపెట్టింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376(2)(f), 376(2)(k)తో పాటు 354A, 354B కింద తేజ్‌పాల్‌ను దోషిగా నిర్ధారించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.

శిక్షపై ప్రత్యేక విచారణ

తేజ్‌పాల్‌ను దోషిగా తేల్చిన హైకోర్టు ఆయనకు విధించాల్సిన శిక్షపై విడిగా విచారణ జరపనుంది. దీంతో ఈ కేసులో తదుపరి విచారణపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. తీర్పు వెలువడిన అనంతరం తేజ్‌పాల్ తరఫు సీనియర్ న్యాయవాది ఆబాద్ పొండా శిక్ష విధించే సమయంలో ఉదారంగా వ్యవహరించాలని ధర్మాసనాన్ని కోరారు. ఘటన జరిగి దాదాపు 13 ఏళ్లు గడిచిందని, ఈ మధ్యకాలంలో తేజ్‌పాల్‌పై మరో కేసు లేదా ఎఫ్‌ఐఆర్ లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

సెషన్స్ కోర్టు నిర్దోషిత్వ తీర్పును హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో అప్పీల్ చేసేందుకు వీలుగా దోష నిర్ధారణ ఉత్తర్వులపై కనీసం ఎనిమిది వారాల స్టే ఇవ్వాలని కూడా కోరారు. తేజ్‌పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు అనంతరం వెల్లడించారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు