హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్–2026’

14 దేశాల నుంచి 110 మంది ప్రతినిధులు హాజరు కార్మికులకు సామాజిక భద్రత, నైపుణ్యాభివృద్ధి, ఉత్తమ కార్మిక విధానాలపై 3 రోజులపాటు కొనసాగనున్న చర్చలు కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత ఉన్నప్పుడే ఉత్పాదకత పెరుగుతుంది: మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు

15 జులై, 2026 1:00 PM•ByGovardhan Reddy

Share this article

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్–2026’

హైదరాబాద్, జూలై 14: హైదరాబాద్‌లోని మారియట్ హోటల్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న "బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్–2026" ను కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో కలిసి రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి మంగళవారం అధికారికంగా ప్రారంభించారు. జూలై 14 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు ఈ అంతర్జాతీయ సదస్సు జరగనుంది.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కార్మిక రంగం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI), ఆటోమేషన్ ప్రభావంతో ఉద్యోగాల స్వరూపం మారుతోందని, ఈ పరిస్థితుల్లో కార్మికులకు సామాజిక భద్రత, నైపుణ్యాభివృద్ధి, నిరంతర శిక్షణ అత్యంత అవసరమని పేర్కొన్నారు.

కార్మికులు తమ ఉద్యోగాలు, కుటుంబ భవిష్యత్తుపై భరోసాతో ఉన్నప్పుడే పరిశ్రమల అభివృద్ధికి పూర్తి స్థాయిలో తోడ్పడగలరని, అందుకే సోషల్ సెక్యూరిటీ, స్కిల్ డెవలప్‌మెంట్, కార్మిక హక్కుల పరిరక్షణపై ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ బ్రిక్స్ సమ్మిట్‌లో టెక్నాలజీ మార్పులు, భవిష్యత్ ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, సామాజిక భద్రత, కార్మిక హక్కులు, ట్రేడ్ యూనియన్ల బలోపేతం వంటి కీలక అంశాలపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. వివిధ దేశాల్లో అమలవుతున్న ఉత్తమ కార్మిక విధానాలను పరస్పరం అధ్యయనం చేసి, వాటిలో ఉత్తమమైన విధానాలను అన్ని దేశాలు అనుసరించేలా సిఫార్సులు రూపొందించడమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యమని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం కూడా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCs) ఏర్పాటు చేసి అత్యాధునిక సాంకేతిక కోర్సుల ద్వారా యువతను పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో తీర్చిదిద్దుతున్నామని వివరించారు.

ప్రపంచంలోని పలు దేశాల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరులకు భారీ డిమాండ్ ఉందని, ఆ అవకాశాలను తెలంగాణ యువతకు అందించేందుకు ప్రభుత్వ సంస్థ టామ్‌కామ్ (TOMCOM) ద్వారా జర్మనీ, జపాన్, యూరప్, మధ్యప్రాచ్య దేశాలు తదితర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. దీని ద్వారా యువతకు అధిక వేతనాలతో కూడిన విదేశీ ఉపాధి లభించడంతో పాటు రాష్ట్రంలో కూడా కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.

ఈ మూడు రోజుల సదస్సులో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), బెలారస్, మలేషియా, నైజీరియా సహా 14 దేశాలకు చెందిన సుమారు 110 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. కార్మిక సంక్షేమం, సామాజిక న్యాయం, ఉపాధి భద్రత, అంతర్జాతీయ సహకారం తదితర అంశాలపై విస్తృత చర్చలు నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన సిఫార్సులను రూపొందించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌లు పనిచేస్తున్నాయి. దేశంలోని అతిపెద్ద కేంద్ర కార్మిక సంఘం భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) ఈ అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది.

కార్యక్రమంలో వివిధ దేశాల ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు