Jantar Mantar protest | జంతర్‌మంతర్‌లో జరిగిన కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనల వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు దర్యాప్తును ముమ్మరం చేశాయి. ముఖ్యంగా ఈ నిరసనలకు విదేశీ నిధులు అందాయా? నిధులు ఏ మార్గాల ద్వారా సమీకరించారు? అనే అంశాలపై ప్రత్యేకంగా ఆరా తీస్తున్నాయి. డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో పనిచేసే సంస్థలు సహా ఐదుకుపైగా కంపెనీలు దర్యాప్తు సంస్థల నిఘాలో ఉన్నట్లు సమాచారం. గత మూడు రోజులుగా ముంబై, బెంగళూరు, గురుగ్రామ్, ఢిల్లీ నగరాల్లోని ఆయా కంపెనీల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, ప్రచార కార్యక్రమాల వివరాలు, ఇన్‌ఫ్లూయెన్సర్లతో కుదుర్చుకున్న ఒప్పందాలను అధికారులు పరిశీలించారు. కొన్ని డిజిటల్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. దర్యాప్తులో ఇప్పటికే పలు అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల పాత్రపైనా అధికారులు దృష్టి సారించారు. లిఖితపూర్వక, డిజిటల్ ఆధారాలను పూర్తిగా సేకరించిన అనంతరం ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
2వేల అనుమానాస్పద ఖాతాల గుర్తింపు
దర్యాప్తులో భాగంగా పరిశీలించిన సుమారు 2వేల అనుమానాస్పద సోషల్ మీడియా ఖాతాల ద్వారా కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రూపొందించిన వీడియోలు, తప్పుడు పోస్టులు విస్తృతంగా ప్రచారం చేసినట్లు గుర్తించినట్లు సమాచారం. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ ప్రచారం సాగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గుర్తించిన ఖాతాల్లో అనేకం విదేశాల నుంచి నిర్వహించబడుతుండగా.. దాదాపు 700 ఖాతాలు భారత్‌లోనే నిర్వహిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలుస్తోంది. ఈ ఖాతాలకు సంబంధించిన డిజిటల్ డేటా భద్రత అంశాలపైనా దర్యాప్తు సంస్థలు సమాచారం సేకరిస్తున్నాయి.
జైష్ ఉగ్రవాది కుట్ర భగ్నం
పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) అరెస్టు చేసిన జైష్-ఏ-మహ్మద్ అనుమానిత ఉగ్రవాది హమీమ్ మండల్ కుట్రను వెలికితీసింది. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో జరిగిన విద్యార్థుల నిరసనల్లో పోలీసు యూనిఫాం ధరించి విధ్వంసానికి పాల్పడాలని అతడు ప్రణాళిక రచించినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. పలువురు పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు కూడా హమీమ్ లక్ష్యంగా ఉన్నారని వర్గాలు వెల్లడించాయి. జంతర్‌మంతర్ నిరసనలు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో పలువురు యూట్యూబర్ల పాత్రపైనా దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. వారి కార్యకలాపాల్లో అనుమానాస్పద అంశాలు ఉన్నాయని, ఆర్థిక లావాదేవీల కోణంలోనూ విచారణ కొనసాగుతోందని సమాచారం.




















