కృష్ణాష్టమి రోజు ఇంటి ముందు కృష్ణుడి పాదాలు ఎందుకు వేస్తారు? .. ఎలాంటి నైవేద్యాలు కన్నయ్యకు ఇష్టం!

కృష్ణాష్టమి రోజున ఇంటి గుమ్మం నుంచి పూజ గది వరకు బాలకృష్ణుడి చిన్న పాదముద్రలను వేయడం అనేక కుటుంబాల్లో ఆనవాయితీగా వస్తోంది. బాలకృష్ణుడు తమ ఇంట్లోకి అడుగుపెట్టి ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో ఈ పాదాలను వేస్తారు.

3 సెప్టెంబర్, 2026 2:38 PM•ByNarender Kumar Nangunoori

Share this article

కృష్ణాష్టమి రోజు ఇంటి ముందు కృష్ణుడి పాదాలు ఎందుకు వేస్తారు? ..  ఎలాంటి నైవేద్యాలు కన్నయ్యకు ఇష్టం!

Social Media Image

కృష్ణాష్టమి | సెప్టెంబర్ 03 (జనవాణి): శ్రీకృష్ణుడు జన్మించిన పవిత్రమైన రోజును కృష్ణాష్టమి లేదా శ్రీకృష్ణ జన్మాష్టమిగా భక్తులు జరుపుకుంటారు. ఈ ఏడాది కృష్ణాష్టమి సెప్టెంబర్ 4, శుక్రవారం నాడు నిర్వహించుకోనున్నారు.

కృష్ణాష్టమి రోజు పాదాలు ఎందుకు వేస్తారు?

కృష్ణాష్టమి రోజున ఇంటి గుమ్మం నుంచి పూజ గది వరకు చిన్నారి కృష్ణుడి పాదముద్రలను వేయడం అనేక కుటుంబాల్లో సంప్రదాయంగా కొనసాగుతోంది. సాధారణంగా బియ్యం పిండితో ఈ పాదముద్రలను వేస్తారు. బాలకృష్ణుడు తమ ఇంట్లోకి అడుగుపెట్టి ఆశీర్వదించాలనే భక్తి విశ్వాసానికి ఇది ప్రతీకగా భావిస్తారు. వెన్న దొంగిలిస్తూ, గోకులంలో అటూ ఇటూ ఆడుకుంటూ తిరిగిన బాలకృష్ణుడి బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ చిన్న పాదాల ఆకారంలో ఈ ముగ్గును వేస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంతోషం, శాంతి నెలకొని, శ్రీకృష్ణుడి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం.

Sri krishna steps

కన్నయ్యకు ఇష్టమైన నైవేద్యాలు ఏంటి?

కృష్ణాష్టమి రోజున బాలకృష్ణుడికి ఆయనకు ఇష్టమైనవిగా భావించే పలు పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు.

వెన్న: చిన్నప్పటి నుంచే కృష్ణుడికి వెన్న అంటే ఎంతో ఇష్టమని పురాణ కథలు చెబుతాయి. గోకులంలో వెన్న దొంగిలించి తినే బాలకృష్ణుడి కథలు ఇప్పటికీ భక్తులను అలరిస్తుంటాయి.

అటుకులు: కృష్ణుడి బాల్య స్నేహితుడు కుచేలుడు ప్రేమతో తీసుకెళ్లిన అటుకులను కృష్ణుడు సంతోషంగా స్వీకరించిన కథ ప్రాచుర్యంలో ఉంది. అందుకే అటుకులను కన్నయ్యకు ఇష్టమైన నైవేద్యంగా భావిస్తారు.

పాలు, పెరుగు, నెయ్యి: యాదవుల జీవన విధానంతో కృష్ణుడికి ఉన్న అనుబంధం కారణంగా పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, పాలకోవా వంటి పాల పదార్థాలను కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. ముఖ్యంగా తమిళనాడులో కృష్ణాష్టమి సందర్భంగా ఉప్పు శీడై, వెల్ల శీడై, మురుకులు, అప్పం, వెన్న, కలకండ వంటి ప్రత్యేక వంటకాలను తయారు చేసి కన్నయ్యకు నైవేద్యంగా పెడతారు.

పిల్లలకు బాలకృష్ణుడి వేషం ఎందుకు వేస్తారు?

కృష్ణాష్టమి సందర్భంగా ఇంట్లోని చిన్నారులకు బాలకృష్ణుడు లేదా రాధ వేషం వేయడం కూడా అందమైన భక్తి, సాంస్కృతిక సంప్రదాయంగా కొనసాగుతోంది. పిల్లలను నెమలి ఈక, పిల్లనగ్రోవి, మాల వంటి అలంకరణలతో బాలకృష్ణుడిలా ముస్తాబు చేస్తారు. ఇది కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు. కృష్ణుడి కథలు, భారతీయ సంస్కృతి, పండుగల ప్రాధాన్యతను పిల్లలకు పరిచయం చేస్తూ.. కుటుంబ సభ్యులంతా కలిసి పండుగను ఆనందంగా జరుపుకునే ఒక చక్కని సందర్భం.

అందుకే కృష్ణాష్టమి రోజున ఇంటి ముందు కనిపించే ఆ చిన్న పాదముద్రలు కేవలం ముగ్గు కాదు.. బాలకృష్ణుడిని ఇంట్లోకి ఆహ్వానించే భక్తికి ప్రతీకగా భావిస్తారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు