జనవాణి: న్యూస్ డెస్క్ August 22: ముంబయి: ఇకపై మహారాష్ట్రలో లూజ్‌గా వంట నూనె కొనడం, అమ్మడం కుదరదు. నూనెను ప్యాకెట్‌లో కాకుండా బహిరంగంగా విక్రయించే విధానానికి మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) చెక్ పెట్టింది. తయారీదారుల నుంచి డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లు, సూపర్‌మార్కెట్లు, ఆన్‌లైన్ విక్రయదారుల వరకు మొత్తం సరఫరా వ్యవస్థకు వర్తించేలా 14 అంశాలతో కూడిన నిబంధనలను జారీ చేసింది. ఇకపై సీల్‌డ్, ట్యాంపర్ ఎవిడెంట్, పూర్తి వివరాలతో కూడిన లేబుల్ ప్యాకేజీల్లోనే వంట నూనె విక్రయించాల్సి ఉంటుంది.
లూజ్ ఆయిల్‌కు పూర్తిగా చెక్
మహారాష్ట్ర FDA జారీ చేసిన కొత్త ఆదేశాల ప్రకారం.. ప్యాక్ చేయని లేదా లూజ్ వంట నూనెను విక్రయించడంపై నిషేధం అమల్లోకి వచ్చింది. తయారీదారులు, డిస్ట్రిబ్యూటర్లు లూజ్‌గా నూనెను సరఫరా చేస్తే వారినే ప్రాథమికంగా నిబంధనలు ఉల్లంఘించినవారిగా పరిగణించే అవకాశం ఉంది. నూనె ప్యాకేజీ సీల్‌డ్‌గా ఉండటంతో పాటు ట్యాంపర్ ఎవిడెంట్‌గా ఉండాలి. తయారీ తేదీ, బ్యాచ్ నంబర్, గడువు తేదీ, తయారీదారు తదితర వివరాలు లేబుల్‌పై స్పష్టంగా ఉండాలి. దీంతో నూనె ఎక్కడ తయారైంది? ఎక్కడి నుంచి వచ్చింది? నాణ్యత ఎలా ఉంది? అనే విషయాలను సులభంగా గుర్తించే అవకాశం ఉంటుంది.
ఎందుకింత కఠిన నిర్ణయం?
వంట నూనె రంగంలో తనిఖీల సందర్భంగా పలు ఉల్లంఘనలు గుర్తించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు FDA తెలిపింది. కొన్ని చోట్ల నూనెలో తక్కువ ధర కలిగిన ఇతర నూనెలను కలపడం, అనుమతి లేని మిశ్రమాలు తయారు చేయడం, అసలు మూలాన్ని దాచేందుకు రీలేబులింగ్ చేయడం వంటి వ్యవహారాలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే నూనెను సరైన ప్యాకేజింగ్ లేకుండా నిల్వ చేయడం, గడువు సమీపించిన నూనెను మళ్లీ ప్యాక్ చేయడం వంటి ఉల్లంఘనలపైనా FDA దృష్టి సారించింది.
1,247 శాంపిల్స్.. ఏం తేలింది?
2025-26లో మహారాష్ట్ర FDA వంట నూనెకు సంబంధించి 1,247 శాంపిల్స్‌ను పరీక్షించింది. వీటిలో 1,142 శాంపిల్స్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు తేలగా.. 77 శాంపిల్స్ సబ్‌స్టాండర్డ్‌గా, 13 శాంపిల్స్ అన్‌సేఫ్‌గా, 15 శాంపిల్స్ మిస్‌బ్రాండెడ్‌గా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ తనిఖీల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించని వ్యాపారాలపై చర్యలు తీసుకున్నట్లు FDA తెలిపింది. ఇటీవల బీడ్ జిల్లాలో నిర్వహించిన తనిఖీల్లోనే భారీ మొత్తంలో సబ్‌స్టాండర్డ్ వంట నూనెను స్వాధీనం చేసుకుని, పలు సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేసింది.
చిన్న మొత్తాల్లో కొనేవారిపైనే ఎక్కువ ప్రభావమా?
లూజ్ నూనె కొనుగోలు చేసే వినియోగదారులకు ఉత్పత్తి మూలం, బ్యాచ్ వివరాలు, తయారీ తేదీ వంటి సమాచారం అందుబాటులో ఉండటం కష్టమని FDA పేర్కొంది. దీంతో ఏదైనా నాణ్యత సమస్య తలెత్తితే ఆ నూనెను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో గుర్తించడం కూడా కష్టమవుతుంది. అందుకే వినియోగదారులు సీల్‌డ్ ప్యాకెట్లలో ఉన్న వంట నూనెనే కొనుగోలు చేయాలని మహారాష్ట్ర FDA కమిషనర్ తుకారాం ముండే సూచించారు. ప్యాకెట్ సీల్ సరిగా ఉందా? లేబుల్‌పై తయారీ, గడువు తేదీలు ఉన్నాయా? వంటి వివరాలను చూసుకోవాలని సూచించారు.
వ్యాపారుల నుంచి ఆన్‌లైన్ విక్రయదారుల వరకు..
ఈ కొత్త నిబంధనలు కేవలం రిటైల్ దుకాణాలకు మాత్రమే పరిమితం కావు. వంట నూనె తయారీదారులు, రిఫైనర్లు, బ్లెండర్లు, రీప్యాకింగ్ యూనిట్లు, దిగుమతిదారులు, హోల్‌సేల్ వ్యాపారులు, రవాణాదారులు, రిటైలర్లు, ఈ-కామర్స్ సంస్థల వరకు మొత్తం సరఫరా వ్యవస్థకు వర్తిస్తాయి.
వినియోగదారులకు ఏం మారుతుంది?
ఇప్పటివరకు అవసరానికి తగ్గట్టుగా లూజ్ నూనెను కిలోల లెక్కన కొనుగోలు చేసే వారికి ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. ఇకపై ప్యాక్ చేసిన నూనెను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మరోవైపు ప్యాకేజింగ్, లేబులింగ్, ట్రేసబిలిటీ తప్పనిసరి కావడంతో కల్తీ, నాణ్యతలేని నూనె విక్రయాలను అరికట్టడం సులభమవుతుందని FDA భావిస్తోంది.




















