ఈ కంపెనీ బంకుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు..లీటరు పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంపుదల

ప్రైవేట్ ఇంధన రిటైలర్ నయారా ఎనర్జీ వాహనదారులకు షాక్ ఇచ్చింది. పెట్రోల్ ధరను లీటరుకు రూ.5, డీజిల్ ధరను రూ.3 చొప్పున పెంచింది. దేశవ్యాప్తంగా ఉన్న నయారా ఫ్యూయల్ స్టేషన్లలో కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ధరల సవరణ చేపట్టినట్లు తెలుస్తోంది.

3 అక్టోబర్, 2026 4:33 PM•ByNarender Kumar Nangunoori

Share this article

 ఈ కంపెనీ బంకుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు..లీటరు పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంపుదల

దేశంలోని ప్రముఖ ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి సవరించింది. పెట్రోల్ ధరను లీటరుకు రూ.5, డీజిల్ ధరను రూ.3 చొప్పున పెంచింది. ఈ కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా నయారా ఎనర్జీకి సుమారు 7,108 ఫ్యూయల్ స్టేషన్లు ఉన్నాయి. తాజా పెంపుతో ఈ రిటైల్ ఔట్‌లెట్లలో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసే వినియోగదారులపై అదనపు భారం పడనుంది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇంధన రిటైలర్లపై వ్యయ ఒత్తిడి పెరిగిన సమయంలో ఈ ధరల పెంపు చోటుచేసుకుంది.

మార్చిలోనూ ఇదే తరహా పెంపు

ఈ ఏడాది మార్చి 26న కూడా నయారా ఎనర్జీ పెట్రోల్ ధరను లీటరుకు రూ.5, డీజిల్ ధరను రూ.3 పెంచింది. ఆ తర్వాత నయారా స్టేషన్లలో పెట్రోల్ ధర రూ.100.71, డీజిల్ ధర రూ.91.31గా నమోదైంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా సరఫరాపై ఆందోళనలు పెరగడం వంటి పరిణామాల నేపథ్యంలో అప్పట్లో ధరల సవరణ చేపట్టింది.

జూలైలో ధరలు తగ్గించిన నయారా

అయితే అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో నయారా ఎనర్జీ జూలై 1న ధరలను తిరిగి తగ్గించింది. పెట్రోల్‌పై లీటరుకు రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున తగ్గించింది. తాజాగా అంతర్జాతీయ చమురు ధరల్లో చోటుచేసుకున్న పెరుగుదల నేపథ్యంలో మరోసారి ధరలను పెంచింది. ఇదిలా ఉండగా, ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలైన భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి తాజా పెంపును ప్రకటించలేదు. దీంతో ప్రభుత్వ రంగ ఇంధన కంపెనీలతో పోలిస్తే నయారా ఎనర్జీ తీసుకున్న తాజా ధరల నిర్ణయం ప్రత్యేకంగా నిలిచింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు