26 రోజుల నిరాహార దీక్షకు ముగింపు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సోనమ్ వాంగ్‌చుక్

సుదీర్ఘ నిరాహార దీక్ష విరమణ అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సామాజిక, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆయన తన తదుపరి కార్యాచరణను వెల్లడించారు.

27 జులై, 2026 3:34 PM•ByNarender Kumar Nangunoori

Share this article

26 రోజుల నిరాహార దీక్షకు ముగింపు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సోనమ్ వాంగ్‌చుక్

ప్రముఖ సామాజిక, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ సుదీర్ఘ నిరాహార దీక్ష అనంతరం పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్యం మెరుగుపడిన అనంతరం ఆయన తన తదుపరి కార్యాచరణను ప్రకటించారు. ముందుగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పించి, అక్కడి నుంచి తిరిగి తన స్వస్థలం లడఖ్‌కు వెళ్లనున్నట్లు తెలిపారు.

26 రోజులపాటు సాగిన తన పోరాటానికి దేశవ్యాప్తంగా లభించిన మద్దతుకు వాంగ్‌చుక్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. యువత, విద్యార్థులు, సామాజిక సంస్థలు, ప్రజలు చూపిన ఐక్యతే ఈ ఉద్యమ విజయానికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.

వైద్యులకు ప్రత్యేక ధన్యవాదాలు

గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందిన వాంగ్‌చుక్, డిశ్చార్జ్‌కు ముందు మాట్లాడుతూ తన ఆరోగ్యం ఇప్పుడు క్రమంగా మెరుగుపడుతోందని చెప్పారు. "నా శరీరంలో మళ్లీ శక్తి వస్తోంది. నెమ్మదిగా ఆహారం తీసుకుంటున్నాను. నాకు అద్భుతమైన వైద్యం అందించిన మేదాంత ఆస్పత్రి వైద్యులు, నర్సులు, సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు." అని ఆయన తెలిపారు.అలాగే తన పిలుపుకు స్పందించి దేశవ్యాప్తంగా ఉద్యమానికి మద్దతు తెలిపిన యువతకు, విద్యార్థులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వ హామీతో దీక్ష విరమణ

26 రోజుల సుదీర్ఘ నిరాహార దీక్ష అనంతరం కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక హామీలు ఇవ్వడంతో వాంగ్‌చుక్ జూలై 23న తన దీక్షను విరమించారు.

ప్రభుత్వం ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని, నీట్ పేపర్ లీకేజీ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురై ప్రాణాలు కోల్పోయిన అభ్యర్థుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీలతో ఉద్యమం ఒక కీలక మలుపు తిరిగిందని వాంగ్‌చుక్ అభిప్రాయపడ్డారు.

మంత్రి రాజీనామాపై స్పందన

దీక్ష విరమించిన కొద్ది రోజులకే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడం కూడా ఈ ఉద్యమానికి లభించిన నైతిక విజయమని వాంగ్‌చుక్ పేర్కొన్నారు.

ఇది శాంతియుత పోరాటం, సహనం, పట్టుదలకు దక్కిన విజయం. అని ఆయన అన్నారు. అలాగే ఉద్యమంలో భాగస్వాములైన సంస్థలు కూడా తమ నిరసన కార్యక్రమాలను విరమించుకుంటున్నట్లు ప్రకటించాయి.

రాజ్‌ఘాట్ నుంచి లడఖ్‌కు.. కొత్త పోరాటాలకు సిద్ధం

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మొదట మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పించి, అనంతరం లడఖ్‌కు తిరిగి వెళ్లనున్నట్లు సోనమ్ వాంగ్‌చుక్ తెలిపారు. ఈ పోరాటం ఇక్కడితో ముగియదు. ప్రజల హక్కులు, పారదర్శకమైన విద్యా వ్యవస్థ, దేశ భవిష్యత్తు కోసం నా ప్రయాణం కొనసాగుతుంది అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం వాంగ్‌చుక్ ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల సూచన మేరకు కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు సమాచారం.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు