ఖాఠ్మాండూ: కరోనా మహమ్మారి సమయంలో ఎంతో మందికి అండగా నిలిచి ‘రియల్ హీరో’గా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. నేపాల్‌లో వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు ఆయన ఖాఠ్మాండూకు వెళ్లారు. ఈ సందర్భంగా వరదలకు తీవ్రంగా ప్రభావితమైన త్రిశూలి బజార్‌ను సోనూసూద్ సందర్శించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించడంతో పాటు స్థానికులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితుల పట్ల తన సానుభూతిని వ్యక్తం చేశారు.
నేపాల్‌లో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే బాధగా ఉందని సోనూసూద్ అన్నారు. ఈ కష్టకాలంలో పొరుగు దేశానికి అండగా నిలుస్తున్న భారత ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. ప్రస్తుతం నేపాల్ ఎదుర్కొంటున్న సంక్షోభం కొన్ని వారాల్లో లేదా నెలల్లో పూర్తిగా పరిష్కారం కాదని, దేశానికి దీర్ఘకాలికంగా నిరంతర మద్దతు అవసరమని అభిప్రాయపడ్డారు. అప్పుడే బాధితులు తిరిగి సాధారణ జీవితంలోకి రాగలరని పేర్కొన్నారు.
నేపాల్‌లో గత నెల 26న సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. అనేక గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇళ్లు, రహదారులు, వంతెనలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. జలవిద్యుత్ ప్రాజెక్టులు కూడా తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈ విపత్తులో 1,127 మంది మృతి చెందారు. చిత్వాన్, తూర్పు నవల్పరాసి, పశ్చిమ నవల్పరాసి, నువాకోట్, గోర్ఖా, ధాడింగ్, రసువా, తనాహు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో మృతదేహాలను రెస్క్యూ బృందాలు వెలికితీశాయి. మరోవైపు 1,113 మృతదేహాలకు పోస్టుమార్టం, చట్టపరమైన గుర్తింపు ప్రక్రియ పూర్తయినట్లు పోలీసులు తెలిపారు. వీటిలో 95 మృతదేహాలను బంధువులకు అప్పగించినట్లు వెల్లడించారు.
వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ఇప్పటివరకు 6,541 మందిని భద్రతా దళాలు రక్షించాయి. ఇంకా 4,858 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, నేపాల్‌లో సంభవించిన ఈ ఆకస్మిక వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని ఆ దేశ ప్రధాని బలేంద్ర షా పేర్కొన్నారు.




















