ఒకప్పుడు ఫుడ్ డెలివరీ బాయ్.. ఇప్పుడు కోటీశ్వరుడు! ఈ రచయిత రియల్ లైఫ్ స్టోరీ మైండ్ బ్లాక్ అంతే!

జీవితంలో ఓడిపోయానని అనుకున్న సమయంలోనే అదృష్టం అతని తలుపు తట్టింది. ఒకప్పుడు డాక్టర్ కావాలనుకున్న యువకుడు.. కుటుంబ పరిస్థితులతో చదువు మానేసి స్విగ్గీ డెలివరీ బాయ్‌గా మారాడు. రోజుకు 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు.. ప్రమాదంలో కాలు పోతుందనే పరిస్థితి ఎదురైంది. కానీ అదే ప్రమాదం అతడిలో దాగున్న రచయితను బయటకు తీసింది. ఇప్పుడు కథలు రాస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు.

26 జులై, 2026 9:19 AM•ByLaharika

Share this article

ఒకప్పుడు ఫుడ్ డెలివరీ బాయ్.. ఇప్పుడు కోటీశ్వరుడు! ఈ రచయిత రియల్ లైఫ్ స్టోరీ మైండ్ బ్లాక్ అంతే!

ఫరీదాబాద్: కొందరి జీవితాలు సినిమా కథలను తలపిస్తాయి. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన అజిత్ కుమార్ జీవితం కూడా అలాంటిదే. ఒకప్పుడు తెల్ల కోటు వేసుకుని డాక్టర్ కావాలని కలలు కన్నఆ యువకుడు .. పరిస్థితుల కారణంగా ఆ కలను మధ్యలోనే వదులుకోవాల్సి వచ్చింది. కానీ విధి అతని కోసం మరో దారిని ఎంచుకునేలా చేసి.. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించేలా చేసింది.

రైతు కుటుంబం..

రైతు కుటుంబానికి చెందిన అజిత్ తండ్రి.. పిల్లలకు మంచి చదువు అందించాలనే ఉద్దేశంతో కుటుంబాన్ని ఫరీదాబాద్‌కు తీసుకెళ్లారు. చిన్నప్పటి నుంచే డాక్టర్ కావాలన్నదే అతని లక్ష్యం. కానీ కుటుంబ పరిస్థితులు అతడి లక్ష్యానికి అడ్డకట్టవేశాయి. చివరికి బీఎస్సీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎమ్మెస్సీ చదవాలని అనుకున్నా.. ఫీజు చెల్లించే స్థోమత కుటుంబానికి లేకపోవడంతో ఆ కల అక్కడితో ముగిసిపోయింది.

చదువు ఆగిపోయాక ఉద్యోగం కోసం వెతికిన అజిత్.. ఓ బ్యాంకులో పనిచేశాడు. నెలకు రూ.80 వేల నుంచి రూ.90 వేల వరకు సంపాదించేవాడు. అయితే వ్యక్తిగత కారణాలతో ఆ ఉద్యోగం కూడా వదిలేయాల్సి వచ్చింది. ఇదే సమయంలో అక్క పెళ్లి కోసం తీసుకున్న రూ.7 లక్షల రుణం అతని భుజాలపై పడింది.

రోడ్డు ప్రమాదం.. జీవితాన్నే మార్చేసింది

ఆ అప్పు తీర్చేందుకు స్విగ్గీ డెలివరీ పార్ట్‌నర్‌గా చేరాడు. రోజుకు 16 గంటలు పని చేస్తూ.. 20 డెలివరీలు పూర్తి చేయడానికి సుమారు 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కేవాడు. వర్షాకాలం వస్తే ఎక్కువ ఆర్డర్లు వస్తాయని, అదే తనకు ఆదాయంగా మారేదని చెప్పాడు.

అయితే ఓ రోజు జరిగిన రోడ్డు ప్రమాదం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. తీవ్ర గాయాలతో మంచానికే పరిమితమయ్యాడు. కాలు తొలగించాల్సి రావచ్చని వైద్యులు చెప్పడంతో ఒక్కసారిగా ఆశలన్నీ చిగురుటాకులయ్యాయి. పని లేదు.. ఆదాయం లేదు.. అప్పు మాత్రం అలాగే ఉంది.

జీవితంలో టర్నింగ్ పాయింట్

అదే సమయంలో ఇంట్లో నుంచే చేయగలిగే ఉద్యోగాల కోసం వెతుకుతుండగా Pocket FMలో రచయితల కోసం ప్రకటన కనిపించింది. కథలు రాయడం ప్రారంభించాడు.

మొదట రాసిన 'మానవ్ ఔర్ దానవ్' కథ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అయినా వెనక్కి తగ్గలేదు. చివరకు భారతీయ పురాణాల ఆధారంగా 'బ్రహ్మయోధ: ది డిస్ట్రాయర్' కథను రూపొందించాడు. అదే అతని జీవితంలో టర్నింగ్ పాయింట్ అయింది.

మూడు నెలల్లోనే అతని కథ Pocket FM నిర్వహించిన పోటీలో విజేతగా నిలిచింది. మొదట రూ.20 వేల పారితోషికం వచ్చింది. ఆ డబ్బంతా తల్లికి ఇచ్చేశాడు. తర్వాత రూ.52 వేల చెక్ వచ్చింది. కొద్ది రోజుల్లోనే నెలకు రూ.6.29 లక్షలు.. ఆ తర్వాత రూ.11 లక్షలకు పైగా సంపాదించే స్థాయికి చేరుకున్నాడు.

అజిత్ చెప్పిన ప్రకారం.. 2026 తొలి ఆరు నెలల్లోనే రూ.40 నుంచి రూ.45 లక్షల వరకు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ముగిసేలోపు కోటి రూపాయల ఆదాయాన్ని దాటుతాననే నమ్మకం ఉంది.

ప్రస్తుతం 'బ్రహ్మయోధ: ది డిస్ట్రాయర్' Pocket FMలో అత్యంత ప్రజాదరణ పొందిన సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ కథకు 16.8 కోట్లకు పైగా ప్లేలు రావడంతో పాటు, ఇప్పటికే 1,300కు పైగా ఎపిసోడ్‌లు పూర్తయ్యాయి.

ఏ పని చిన్నది కాదు.. ప్రయత్నం ఆపొద్దు!

కెరీర్ గురించి మాట్లాడిన అజిత్.. జీవితంలో ఒక్క దారే ఉండదని చెబుతున్నాడు. "బ్రైడల్ మేకప్ చేశాను.. మెహందీ కూడా వేశాను.. వ్లాగింగ్ ట్రై చేశాను.. డాక్టర్ కావాలని చదివాను. ఏ పని చిన్నది కాదు. ప్రయత్నం ఆపొద్దు. ప్రతి దారి మన గమ్యానికే తీసుకెళ్తుంది" అని యువతకు సందేశం ఇచ్చాడు.

కృత్రిమ మేధ (AI)పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "మనిషి అనుభూతిని AI ఎప్పటికీ రాయలేదు. భావోద్వేగాలను అనుభవించి రాసే కథలకు ఎప్పుడూ విలువ ఉంటుంది" అని పేర్కొన్నాడు.

తండ్రి ఆశయ సాధన కోసం..

డబ్బు సంపాదించడం మాత్రమే తన లక్ష్యం కాదని.. తన తండ్రి కల అయిన గ్రామంలో తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య అందించే పాఠశాలను స్థాపించడమే తన తదుపరి లక్ష్యమని అజిత్ కుమార్ చెప్పడం విశేషం.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు