మహారాష్ట్ర నుంచి తెలంగాణ అడవుల్లోకి రెండు పులులు.. అప్రమత్తమైన అటవీశాఖ

మహారాష్ట్రలోని టిపేశ్వర్, తాడోబా టైగర్ రిజర్వుల నుంచి తెలంగాణలోని ఆదిలాబాద్ అడవుల్లోకి పులుల కదలికలు పెరిగాయి. భీంపూర్ మండలం అర్లి గ్రామంలో వ్యవసాయ పొలాల్లో పులి కనిపించగా.. మరో పులి కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌లో అడుగుజాడల ద్వారా గుర్తించారు.

22 ఆగస్టు, 2026 9:29 AM•ByVijay Kumar

Share this article

మహారాష్ట్ర నుంచి తెలంగాణ అడవుల్లోకి రెండు పులులు.. అప్రమత్తమైన అటవీశాఖ

AI Generated Image

జనవాణి: న్యూస్ డెస్క్ August 22: మహారాష్ట్రలోని టైగర్ రిజర్వుల నుంచి తెలంగాణ అడవుల్లోకి పులుల రాక పెరుగుతోంది. ఒక పులి పెన్‌గంగా నదిని దాటి ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోకి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. మరో పులి ప్రాణహిత నదిని దాటి కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌లో సంచరిస్తున్నట్లు అడుగుజాడల ఆధారంగా నిర్ధారించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో అటవీశాఖ అధికారులు నిఘా పెంచారు. గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని, అడవుల్లోకి వెళ్లొద్దని సూచిస్తున్నారు.

పొలాల్లో ప్రత్యక్షమైన పులి

భీంపూర్ మండలం అర్లి (టి) గ్రామంలో ఇటీవల వ్యవసాయ పొలాల్లో పులి కనిపించింది. రైతు జి. వెంకట్ యాదవ్‌కు చెందిన పొలంలో అడవి పందిని పులి చంపినట్లు అధికారులు గుర్తించారు. ఈ పులి మహారాష్ట్రలోని టిపేశ్వర్ టైగర్ రిజర్వ్ నుంచి పెన్‌గంగా నదిని దాటి తెలంగాణలోకి ప్రవేశించి ఉండొచ్చని అటవీ అధికారులు భావిస్తున్నారు. పులి వెంట పిల్లలు కూడా ఉండే అవకాశం ఉందన్న అనుమానంతో దాని కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నారు.

కాగజ్‌నగర్ అడవుల్లో మరో పులి

మరోవైపు కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌లోనూ పులి సంచారం వెలుగులోకి వచ్చింది. కౌటాల మండలం నుంచి ముత్యంపేట గ్రామం వరకు, అలాగే చింతలమానేపల్లి మండలంలోని అడెల్లి, ధాబా గ్రామాల పరిసరాల్లో పులి అడుగుజాడలను అధికారులు గుర్తించారు. ఈ పులి మహారాష్ట్ర వైపు నుంచి కదులుతూ కదంబ అటవీ ప్రాంతం మీదుగా ప్రాణహిత నదిని దాటి తెలంగాణలోకి ప్రవేశించి ఉండొచ్చని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

గ్రామస్థులకు అవగాహన.. అడవుల్లోకి వెళ్లొద్దంటూ సూచన

పులుల కదలికలు గుర్తించిన నేపథ్యంలో అటవీశాఖ అధికారులు పరిసర గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పులుల సంచారం, వన్యప్రాణుల సంరక్షణ ప్రాధాన్యాన్ని గ్రామస్థులకు వివరిస్తున్నారు. పులుల కదలికలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా అడవుల్లోకి ప్రవేశించవద్దని అధికారులు సూచిస్తున్నారు. పులులు కనిపిస్తే వాటిని వెంబడించడం లేదా దగ్గరగా వెళ్లి ఫొటోలు, వీడియోలు తీసే ప్రయత్నం చేయొద్దని హెచ్చరిస్తున్నారు.

అక్రమ విద్యుత్ తీగలపై ప్రత్యేక దృష్టి

మరోవైపు అడవుల్లో అక్రమ విద్యుత్ తీగలు, కంచెలను ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకునేందుకు అటవీ, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయం పెంచుతున్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ ఎస్. శాంతారామ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలో విద్యుత్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. అటవీ ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయడానికి ఉన్న నిబంధనలు, అక్రమ విద్యుత్ కనెక్షన్ల గుర్తింపు, వాటిపై చర్యలపై సమావేశంలో చర్చించారు. విద్యుత్ లైన్లలో ట్రిప్పింగ్ ద్వారా గుర్తించే అనుమానాస్పద కనెక్షన్ల సమాచారాన్ని అటవీశాఖతో పంచుకునేందుకు అధికారులు అంగీకరించారు.

అక్రమ విద్యుత్ కంచెలపై చర్యలకు ఆదేశాలు

కొత్తగూడెంలో అక్రమ విద్యుత్ తీగల కంచె కారణంగా ఓ ఫారెస్ట్ బీట్ అధికారి మృతి చెందిన ఘటన నేపథ్యంలో అటవీశాఖ ఈ అంశంపై మరింత దృష్టి సారించింది. అడవుల్లో అక్రమంగా విద్యుత్ తీగలు, కంచెలు ఏర్పాటు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను అటవీశాఖ కోరింది. అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయాలని సూచించింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు