డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కాంగో నైరుతి ప్రాంతంలోని కిక్విట్ నుంచి రాజధాని కిన్షాసాకు తిరిగి వస్తున్న విమానం సాంకేతిక లోపానికి గురై కెన్గే సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం 14 మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు సీనియర్ సైనిక అధికారులు ఉన్నారు. వారిలో మిలిటరీ కోర్ట్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ముటోంబో కటలాయి టియెండే, సాయుధ దళాల ఆడిటర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ బకుమి లికులియా ఉన్నారు. మిగిలిన వారిలో సైనిక అధికారుల ప్రతినిధి బృందం సభ్యులతో పాటు విమాన సిబ్బంది ఉన్నారు. ఈ విషయాన్ని కాంగో సైన్యం శుక్రవారం వెల్లడించింది. కాంగో సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ ఎఫోమి ఎకెంగే ప్రకారం.. ఇద్దరు జనరల్ స్థాయి అధికారులు, ప్రతినిధి బృందంలోని సభ్యులు, విమాన సిబ్బంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాదానికి కారణం ఏమిటి?
విమాన ప్రమాదానికి దారితీసిన కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు మేజర్ జనరల్ ఎఫోమి ఎకెంగే తెలిపారు. అయితే ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని సివిల్ ఏవియేషన్ అథారిటీ బోర్డు చైర్మన్ ట్రైఫోన్ కిన్-కియె ములుంబా వెల్లడించారు. సాంకేతిక లోపం కారణంగా విమానం కూలిపోయినట్లు ప్రాథమిక సమాచారం ఉన్నప్పటికీ, దర్యాప్తు పూర్తయ్యే వరకు పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
కాంగోలో కొనసాగుతున్న భద్రతా సంక్షోభం
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో చాలాకాలంగా భద్రతా సంక్షోభం కొనసాగుతోంది. ముఖ్యంగా దేశ తూర్పు ప్రాంతంలో సైన్యం, పలు తిరుగుబాటు గ్రూపుల మధ్య తీవ్ర పోరాటం జరుగుతోంది. కీలక నగరాలను స్వాధీనం చేసుకునేందుకు తిరుగుబాటు గ్రూపులు వరుస దాడులకు పాల్పడుతున్నాయి. గత ఏడాది కాలంగా కాంగో సైన్యం తూర్పు ప్రాంతంలో రువాండా మద్దతు ఉందని కాంగో ప్రభుత్వం ఆరోపిస్తున్న ఎం23 గ్రూప్ సహా పలు తిరుగుబాటు సంస్థలతో పోరాడుతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ సైనిక అధికారుల మరణం కాంగో సైన్యంలో విషాదాన్ని మిగిల్చింది.
Loading Tweet...




















