న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనవాణి): తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు సుప్రీంకోర్టులో మళ్లీ మొదటి దశకు చేరుకుంది. కేసుపై తుది విచారణ సందర్భంగా వాదనలు విన్న ధర్మాసనంలోని న్యాయమూర్తులు పదవీ విరమణ చేయడంతో.. నిబంధనల ప్రకారం కొత్త ధర్మాసనం ఈ కేసును మొదటి నుంచి విచారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గురువారం ఈ కేసుకు సంబంధించిన పిటిషన్లు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు పార్ట్-హెర్డ్ మ్యాటర్‌గా విచారణకు వచ్చాయి.
ఇప్పటికే ఈ కేసులో సుదీర్ఘంగా వాదనలు విన్న న్యాయమూర్తులు రిటైరైన నేపథ్యంలో పాత వాదనలను కొత్త ధర్మాసనం నేరుగా పరిగణనలోకి తీసుకోలేదని సీజేఐ స్పష్టం చేశారు. న్యాయ ప్రక్రియ నిబంధనల ప్రకారం కొత్త ధర్మాసనం కేసును మొదటి నుంచి విచారించాల్సి ఉంటుందని తెలిపారు. దీంతో ఇప్పటివరకు జరిగిన వాదనల స్థానంలో మరోసారి పూర్తి స్థాయి విచారణ జరగనుంది. తదుపరి విచారణలో కొత్త ధర్మాసనం కేసులో కీలక అంశాలను పరిశీలించనుంది.
ఈ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్ కూడా కీలకంగా మారింది. ఈ రెండు పిటిషన్లను కలిపి విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. దీంతో కొత్త ధర్మాసనం ముందు జరగబోయే విచారణపై రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.
తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌లో.. ఈ వ్యవహారాన్ని అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా ఎన్నికల చట్టాల ప్రకారం పరిగణించాలని వాదించారు. ఇది క్రిమినల్ అవినీతి కేసుగా కాకుండా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఉల్లంఘనగా చూడాలని ఆయన తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. మరోవైపు సండ్ర వెంకట వీరయ్య తనపై నమోదైన కేసు నుంచి తన పేరును తొలగించాలని కోరుతున్నారు. తనపై ఉన్న ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని ఆయన తరఫు వాదన.
అసలు కేసు ఇదే..
2015 మే 31న తెలంగాణ శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో అప్పటి టీడీపీ నేత రేవంత్‌రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్‌ను కలిసి టీడీపీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరిన వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఇందుకోసం రూ.50 లక్షలు లంచంగా ఇస్తున్నారనే ఆరోపణలతో రేవంత్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో, ఆడియో రికార్డింగులు అప్పట్లో రాజకీయంగా పెను సంచలనం సృష్టించాయి.
తదుపరి దర్యాప్తు చేపట్టిన ఏసీబీ.. అవినీతి నిరోధక చట్టంతో పాటు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 120బీ కింద రేవంత్‌రెడ్డి, ఇతరులపై కేసు నమోదు చేసి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఆడియో, వీడియో రికార్డింగులతో పాటు రూ.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని అప్పట్లో ఏసీబీ పేర్కొంది.
ఏళ్లుగా వివిధ న్యాయస్థానాల్లో కొనసాగుతున్న ఈ కేసు ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. గతంలో విన్న వాదనలను కొత్త ధర్మాసనం పరిగణనలోకి తీసుకోకుండా మొదటి నుంచి విచారణ చేపట్టాల్సి రావడంతో.. రేవంత్‌రెడ్డి క్వాష్ పిటిషన్, సండ్ర వెంకట వీరయ్య పిటిషన్లపై సుప్రీంకోర్టు తదుపరి విచారణలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కేసు తీర్పు రాజకీయ పరిణామాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో తెలంగాణ రాజకీయ వర్గాలు సుప్రీంకోర్టు తదుపరి విచారణపై దృష్టి సారించాయి.





















