ఆషాఢ మాస వేడుకలు.. శాకాంబరీ అవతారంలో నిమిషాంబ అమ్మవారు

బొడుప్పల్‌లోని శ్రీ మాతా నిమిషాంబ దేవి ఆలయంలో ఆషాఢ మాస వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు శ్రీ శాకాంబరీ దేవి అవతారంలో విశేష పుష్ప, కూరగాయల అలంకరణతో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు.

28 జులై, 2026 3:09 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ఆషాఢ మాస వేడుకలు.. శాకాంబరీ అవతారంలో నిమిషాంబ అమ్మవారు

హైదరాబాద్, జులై 28: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, భక్తజనుల ఆరాధ్య దైవం, బొడుప్పల్‌లో కొలువై భక్తులను కరుణాకటాక్షాలతో అనుగ్రహిస్తున్న శ్రీ మాతా నిమిషాంబ దేవి అమ్మవారు, ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ శాకాంబరీ దేవిగా అత్యంత వైభవంగా, విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఆషాఢ మాసంలో జగన్మాతను వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, ధాన్యాలు, పండ్లతో అలంకరించి శాకాంబరీ దేవిగా పూజించడం సనాతన సంప్రదాయంలో విశిష్టమైన ఆచారం. "శాకం" అంటే కూరగాయలు. సమస్త జీవరాశులకు ఆహారాన్ని ప్రసాదించే అన్నపూర్ణ స్వరూపిణిగా, ప్రకృతికి పోషకశక్తిగా అమ్మవారిని శాకాంబరీ దేవిగా కొలవడం ఆనవాయితీ.

ఈ పవిత్ర అలంకరణను దర్శించి పూజిస్తే ప్రకృతి వైపరీత్యాలు తొలగి, సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలు పుష్కలంగా పండుతాయని, భూమాత సస్యశ్యామలంగా విరాజిల్లుతుందని, సమస్త జీవరాశులకు ఆహార లోటు ఉండదని భక్తుల విశ్వాసం. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా ఆలయంలోని ప్రధాన దేవాలయంతో పాటు ఉపాలయాలను కూడా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో రూపొందించిన తోరణాలు, అలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి దివ్య శాకాంబరీ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

ఉదయం నుంచే అశేష భక్తజనులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని, ఓడిబియ్యం, సారె సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు.

భక్తులందరికీ దర్శనం కల్పించేందుకు ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేసి, త్రాగునీరు, క్యూలైన్లు, ప్రసాద వితరణ, ఇతర సౌకర్యాలను సమకూర్చాడం జరిగింది.

ఈ దివ్య దర్శనాన్ని పొందిన భక్తులు అమ్మవారి అనుగ్రహంతో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలు పుష్కలంగా పండి, ప్రపంచమంతా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనసారా ప్రార్థించారు.

ఆలయ చైర్మన్ శ్రీ కామరౌతు వినోద్ కుమార్, సెట్లర్ కళావతి, ప్రధాన కార్యదర్శులు శ్రీ కె. అశోక్ కుమార్, సంగు శ్రీనివాస్, కోశాధికారి ఎన్. రమేష్ , రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాస్ రావు ట్రస్ట్ ధర్మకర్తలు :- బి. హిమచందర్, వై. చంద్రశేఖర్, ఎస్. గౌరి శంకర్, డి. నర్సింగ్ రావు, ఎమ్. శ్రీనివాస్ రావు, ఎమ్. సాయి బాబా (శ్యామ్), డి. సతీష్, రామగిరి శ్రీకాంత్, ఎన్. శ్రీకాంత్, ఎన్ . రామకృష్ణ, ఎన్. మోహన్, డి. రామక్రిష్ణ, ఎన్. శ్రీధర్, వెంకట్ రాజారావు, కె. ప్రవీణ్ కుమార్, డి. నరేష్, వై. సత్యనారాయణ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ చంద్రశేఖర్ శర్మ, అర్చకుడు శ్రీ ఉమకాంత్ శర్మ పాల్గొన్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు