దేవరుప్పుల మండలంలోని చిన్నమాడూరు–రంభోజిగూడెం గ్రామాల మధ్య రాకపోకలను మరింత సులభతరం చేసే రూ.10 కోట్ల 80 లక్షల వ్యయంతో నిర్మించిన ఉన్నతస్థాయి వంతెనను పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న వంతెన కల సాకారమైంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో వంతెన నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధుల కొరత ఉన్నప్పటికీ ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని కాంట్రాక్టర్లతో చర్చించి అగ్రిమెంట్ పూర్తి చేయించి, నిర్మాణ పనులను వేగవంతం చేసి విజయవంతంగా పూర్తిచేసి నేడు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.
ఈ వంతెన నిర్మాణంతో చిన్నమాడూరు, రంభోజిగూడెం గ్రామాల మధ్య రవాణా సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడటంతో పాటు వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులు, విద్యార్థులు, అత్యవసర సేవలకు ఈ వంతెన ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందన్నారు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు అవసరమైన ప్రతి అభివృద్ధి పనిని పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ధనలక్ష్మి భాస్కర్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సంబంధిత శాఖ అధికారులు, గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు, యువత మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.




















