హైదరాబాద్, జులై 31: హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇప్పటికే పలు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, స్కైవేలను నిర్మించిన ప్రభుత్వం.. ఇప్పుడు బంజారాహిల్స్‌లోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో మరో రెండు స్టీల్ ఫ్లైఓవర్లు, ఒక అండర్‌పాస్ నిర్మించేందుకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మొత్తం రూ.368 కోట్ల వ్యయంతో చేపట్టనుంది. హెచ్-సిటీ (H-City) ప్రాజెక్టు కింద ఈ నిర్మాణాలు చేపట్టి నగరంలో సిగ్నల్‌రహిత ప్రయాణాన్ని మరింత విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది.
ఎక్కడ ఏ నిర్మాణం?
నాగార్జున (NFCL) జంక్షన్ నుంచి జీవీకే మాల్ వైపు రూ.147 కోట్లతో రెండు లేన్ల వన్‌వే స్టీల్ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు.
ముగ్ధ జంక్షన్ నుంచి నాగార్జున (NFCL) జంక్షన్ వరకు రూ.62 కోట్లతో మూడు లేన్ల స్టీల్ ఫ్లైఓవర్ ఏర్పాటు చేయనున్నారు.
నాగార్జున (NFCL) జంక్షన్ నుంచి శ్రీనగర్ కాలనీ వైపు రూ.159 కోట్లతో రెండు లేన్ల అండర్‌పాస్ నిర్మించనున్నారు.
మొదట ఈ ప్రాంతంలో ఒక ఫ్లైఓవర్, ఒక అండర్‌పాస్ మాత్రమే నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే తాజా ట్రాఫిక్ అధ్యయనం అనంతరం మరో స్టీల్ ఫ్లైఓవర్‌ను ప్రాజెక్టులో చేర్చారు. అలాగే అండర్‌పాస్ మార్గంలో కూడా మార్పులు చేశారు. దీంతో ప్రాజెక్టు వ్యయం రూ.210 కోట్ల నుంచి రూ.368 కోట్లకు పెరిగింది. అయితే ఈ ప్రాజెక్టుకు అవసరమైన అదనపు రూ.158 కోట్లను విప్రో జంక్షన్ మల్టీ లెవల్ గ్రేడ్ సెపరేటర్ ప్రాజెక్టు నిధుల నుంచి మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో హెచ్-సిటీ ప్రాజెక్టు మొత్తం వ్యయంలో ఎలాంటి అదనపు భారం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

స్టీల్ టెక్నాలజీతో వేగవంతమైన నిర్మాణం
ఈ ఫ్లైఓవర్లను సంప్రదాయ కాంక్రీట్‌కు బదులుగా స్ట్రక్చరల్ స్టీల్ టెక్నాలజీతో నిర్మించనున్నారు. దీంతో నిర్మాణ సమయం తగ్గడమే కాకుండా, పనుల సమయంలో ట్రాఫిక్ అంతరాయం కూడా తక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
'జూబ్లీహిల్స్ కారిడార్' పేరు మార్పు
ఇప్పటివరకు అధికారిక పత్రాల్లో ఈ ప్రాజెక్టును 'జూబ్లీహిల్స్ కారిడార్'గా పేర్కొనగా, ప్రాజెక్టు ప్రాంతం బంజారాహిల్స్ పరిధిలో ఉండటంతో ఇకపై దీనిని 'బంజారాహిల్స్ కారిడార్'గా పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ట్రాఫిక్‌కు ఎంత మేర ఊరట?
ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత...బంజారాహిల్స్, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ, కేబీఆర్ పార్క్, జీవీకే మాల్ ప్రాంతాల మధ్య ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్‌ఎఫ్‌సీఎల్, టీవీ9 జంక్షన్ల వద్ద నిత్యం ఎదురయ్యే ట్రాఫిక్ జామ్‌లకు పెద్దఎత్తున ఉపశమనం లభించనుంది.




















