హైదరాబాద్, జూలై 27: హైదరాబాద్‌లో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ టవర్స్ గృహాల కేటాయింపు ప్రక్రియ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రజలను హెచ్చరించారు. ముఖ్యంగా లబ్ధిదారులు రూ.10 వేల ముందస్తు డిపాజిట్ (EMD) చెల్లించే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో నకిలీ కాల్స్, మెసేజ్‌లు, లింకుల ద్వారా మోసాలు జరిగే ప్రమాదం ఉందని తెలిపారు.
సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ప్రక్రియలో ఎలాంటి దళారులు, మధ్యవర్తులు లేదా ఏజెంట్లకు అవకాశం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తోందని, ఎవరైనా డబ్బులు తీసుకుని ఇల్లు ఇప్పిస్తామని చెబితే వాటిని నమ్మవద్దని సూచించారు.
అలాగే రూ.10 వేల ఈఎండీ (EMD)ను ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించిన వారికి ఎలాంటి నష్టం ఉండదని తెలిపారు. ఒకవేళ ఇల్లు కేటాయించకపోతే చెల్లించిన మొత్తం నేరుగా దరఖాస్తుదారుడి బ్యాంకు ఖాతాలోకే ప్రభుత్వం తిరిగి జమ చేస్తుందని వివరించారు.
సైబర్ నేరగాళ్లు ఇలా మోసం చేసే అవకాశం..
ఈ రోజే చివరి తేదీ, ఇప్పుడే డబ్బులు చెల్లించకపోతే మీ ఇల్లు రద్దవుతుంది అంటూ భయపెట్టే కాల్స్ చేయవచ్చు. వాట్సాప్ లేదా SMS ద్వారా నకిలీ లింకులు పంపించి డబ్బులు కాజేయడానికి ప్రయత్నించవచ్చు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లను పోలిన నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టించి వివరాలు సేకరించే అవకాశం ఉంది. మేము సహాయం చేస్తాం అంటూ AnyDesk, TeamViewer వంటి స్క్రీన్ షేరింగ్ యాప్‌లు డౌన్‌లోడ్ చేయించి బ్యాంక్ వివరాలు దొంగిలించే ప్రమాదం ఉంది.
ఈ విషయాలను అందరు గుర్తుంచుకోవాలి:
సీపీ సజ్జనార్ ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేశారు.
అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌ను నమ్మవద్దు.
వాట్సాప్ లేదా SMSలో వచ్చే తెలియని లింకులను ఓపెన్ చేయవద్దు.
APK ఫైళ్లను డౌన్‌లోడ్ చేయవద్దు. అవి ఫోన్‌ను హ్యాక్ చేసే ప్రమాదం ఉంది.
మీ బ్యాంక్ ఖాతా, ఓటీపీ, యూపీఐ పిన్ వంటి వ్యక్తిగత వివరాలను ఎవరికీ చెప్పవద్దు.
UPI PIN డబ్బులు పంపడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. డబ్బులు స్వీకరించడానికి ఎప్పుడూ పిన్ నమోదు చేయాల్సిన అవసరం లేదు.
మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయండి:
ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని సీపీ సజ్జనార్ సూచించారు. వీలైనంత త్వరగా ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న డబ్బును ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎలాంటి నకిలీవచ్చే కాల్స్, మెసేజ్‌లు, లింకులను నమ్మకుండా అధికారిక తెలంగాణా ప్రభుత్వ మార్గాల ద్వారా మాత్రమే సమాచారాన్ని తెలుసుకోవాలని సిటీ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




















