నేరెళ్ల ఘటన బాధిత కుటుంబాలను తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి గురై బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
బాధితులతో మాట్లాడిన అనంతరం కవిత మాట్లాడుతూ... నాడు అధికారంలో ఉన్న కుటుంబంలో నేను కూడా ఒక సభ్యురాలిని. నేరెళ్ల ఘటనను చూసి సిగ్గుతో తల వంచుకుంటున్నాను. ప్రజలందరూ నన్ను క్షమించండి అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికీ న్యాయం, సమాన అవకాశాలు అందుతాయని ఆశించామని, అయితే కొందరి ధనదాహం కారణంగా నేరెళ్లలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల బాధితుల్లో మరో వ్యక్తి మృతి చెందడం మరింత కలచివేసిందని పేర్కొన్న కవిత... బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, వారి హక్కుల సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. నేరెళ్ల ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.




















