జనవాణి: మణుగూరు August 19: పాత బైక్ భాగాలు, స్క్రాప్ ఇనుము చూస్తే ఎవరికైనా అవి పనికిరాని వస్తువుల్లానే కనిపిస్తాయి. కానీ మణుగూరుకు చెందిన ఆడపా స్ఫూర్తికి మాత్రం వాటిలోనే ఓ ఎలక్ట్రిక్ వాహనం కనిపించింది. కేవలం రూ.45 వేల ఖర్చుతో స్క్రాప్‌తో ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్‌ను తయారు చేసి తన నైపుణ్యాన్ని చాటుకుంది. అదే మణుగూరు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌లో మరో విద్యార్థి పులిపాటి పార్థసారథి ప్రయాణికులతో పాటు సరుకులను తరలించేలా డ్యూయల్ పర్పస్ ఎలక్ట్రిక్ వాహనాన్ని రూపొందించాడు. ఈ రెండు ప్రాజెక్టులు నైపుణ్య శిక్షణతో గ్రామీణ యువతలో దాగి ఉన్న సృజనాత్మకత ఎలా బయటకు వస్తుందో చూపిస్తున్నాయి.
స్క్రాప్‌తో ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన ఆడపా స్ఫూర్తి మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ (MEV) ట్రేడ్‌లో శిక్షణ పొందుతోంది. ‘డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్’ పేరుతో ఆమె రూపొందించిన ప్రాజెక్టు ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పనికిరాని స్క్రాప్ మెటీరియల్‌తో చాసిస్‌ను తయారు చేసి, పాత వాహనాల నుంచి సేకరించిన స్టీరింగ్, చక్రాలు, సస్పెన్షన్ వంటి విడిభాగాలను ఆమె ఉపయోగించింది. వాటికి ఎలక్ట్రిక్ డ్రైవ్ సిస్టమ్‌ను జోడించి పూర్తి స్థాయి ఫోర్ వీలర్‌గా తీర్చిదిద్దింది.
రూ.45 వేలతోనే తయారీ
స్ఫూర్తి రూపొందించిన వాహనంలో 48 వోల్ట్, 750 వాట్ల బీఎల్‌డీసీ మోటార్‌ను ఉపయోగించారు. నాలుగు లీడ్ యాసిడ్ బ్యాటరీలు, డీసీ కన్వర్టర్, ప్రొపెల్లర్ షాఫ్ట్, డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను అమర్చారు. మొత్తం ప్రాజెక్టుకు సుమారు రూ.45 వేలే ఖర్చు కావడం ఈ ఆవిష్కరణలో మరో ప్రత్యేకత. తక్కువ వ్యయంతో పాత వస్తువులను ఉపయోగించి పర్యావరణహిత వాహనాన్ని రూపొందించడం ద్వారా స్ఫూర్తి కొత్త ఆలోచనకు తెరతీసింది.

డిజైన్ నుంచి టెస్టింగ్ వరకు.. అన్నీ నేర్చుకున్న స్ఫూర్తి
వాహనం తయారీలో కేవలం విడిభాగాలను అమర్చడం వరకే స్ఫూర్తి పరిమితం కాలేదు. వాహనం బరువు, మోటార్ సామర్థ్యం, బ్యాటరీ అమరిక, భద్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని డిజైన్ చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఫ్యాబ్రికేషన్, వెల్డింగ్, వైరింగ్, బ్యాటరీ మేనేజ్‌మెంట్, మోటార్ కంట్రోల్, మెకానికల్ అసెంబ్లీ, టెస్టింగ్, ట్రబుల్‌షూటింగ్ వంటి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను కూడా నేర్చుకుంది.
క్యాంపస్‌లో రవాణా, పరిశ్రమల్లో తేలికపాటి వస్తువుల తరలింపు, పర్యావరణ అవగాహన కార్యక్రమాలకు ఈ వాహనాన్ని ఉపయోగించవచ్చని స్ఫూర్తి పేర్కొంది. రీసైక్లింగ్, గ్రీన్ మొబిలిటీ, తక్కువ వ్యయంతో తయారీకి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపింది.
ప్రయాణికులతో పాటు సరుకులకూ.. పార్థసారథి వాహనం
మణుగూరు ఏటీసీలోనే మరో విద్యార్థి పులిపాటి పార్థసారథి తన ఆలోచనకు రూపమిచ్చాడు. కేవలం ప్రయాణికులను తరలించడమే కాకుండా తేలికపాటి సరుకులను కూడా ఒకేసారి తీసుకెళ్లేలా డ్యూయల్ పర్పస్ ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్‌ను రూపొందించాడు. గిరిజన ప్రాంతాలు, గనులున్న ప్రాంతాల్లో ఎదురయ్యే రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ వాహనాన్ని రూపొందించడం దీని ప్రత్యేకత.
ఆధునిక పరికరాలతో ఎలక్ట్రిక్ వాహనం
పార్థసారథి రూపొందించిన వాహనంలో లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్, 48 వోల్ట్ 1250 వాట్ల బీఎల్‌డీసీ మోటార్, 50 యాంపియర్ కంట్రోలర్, ఈ-రిక్షా వైరింగ్ హార్నెస్, స్టీరింగ్ ర్యాక్, డిఫరెన్షియల్, లైటింగ్ సిస్టమ్ వంటి పరికరాలను ఉపయోగించాడు. బలమైన చాసిస్‌తో పాటు భద్రతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని వాహనాన్ని రూపొందించాడు. తయారీ పూర్తయిన తర్వాత లోడ్ సామర్థ్యం, బ్యాటరీ పనితీరు, వేగం, బ్రేకింగ్ వ్యవస్థ, భద్రత తదితర అంశాలను పరీక్షించినట్లు వివరించారు.
రూ.1.65 లక్షల వ్యయంతో డ్యూయల్ పర్పస్ వాహనం
పార్థసారథి ప్రాజెక్టు తయారీకి దాదాపు రూ.1.65 లక్షల వరకు ఖర్చయింది. లిథియం-అయాన్ బ్యాటరీ వినియోగం వల్ల ఎక్కువ దూరం ప్రయాణించడం, వేగంగా చార్జింగ్ కావడం, నిర్వహణ ఖర్చు తగ్గడం వంటి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ వాహనాన్ని రూపొందించాడు. ఈ ప్రాజెక్టు ద్వారా బ్యాటరీ మేనేజ్‌మెంట్, మోటార్ కంట్రోల్, చాసిస్ ఫ్యాబ్రికేషన్, ఎలక్ట్రికల్ వైరింగ్, అసెంబ్లీ, టెస్టింగ్, ట్రబుల్‌షూటింగ్ వంటి నైపుణ్యాలను పార్థసారథి అభ్యసించాడు.

ఏటీసీల్లో మారుతున్న నైపుణ్య శిక్షణ
ఐటీఐలను ఆధునిక అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో విద్యార్థులకు ప్రాజెక్టు ఆధారిత శిక్షణకు అవకాశం పెరుగుతోందని ఈ ప్రాజెక్టులు చాటుతున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికత, శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీస్) మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ జీ. వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో ఏటీసీల్లో ఆధునిక సాంకేతికత, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటన పేర్కొంది. దీంతో హైదరాబాద్ వంటి నగరాలకే పరిమితం కాకుండా మణుగూరు వంటి గ్రామీణ, మారుమూల ప్రాంతాల విద్యార్థులు కూడా తమ ఆలోచనలకు ప్రాజెక్టుల రూపం ఇస్తున్నారు.

ఉద్యోగం కోసం నేర్చుకున్న నైపుణ్యం.. ఆవిష్కరణకు మార్గం
స్ఫూర్తి, పార్థసారథి ప్రాజెక్టులు కేవలం విద్యార్థుల ప్రయోగాలుగా మాత్రమే కాకుండా నైపుణ్య విద్యకు మరో కోణాన్ని చూపిస్తున్నాయి. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవడంతో పాటు, స్థానిక సమస్యలకు పరిష్కారాలు వెతికేలా విద్యార్థులను ప్రోత్సహిస్తే వారు ఆవిష్కర్తలుగా ఎదగగలరనే సందేశాన్ని ఈ ప్రాజెక్టులు అందిస్తున్నాయి.
ఒకరు స్క్రాప్‌కు కొత్త జీవం పోసి తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ వాహనం రూపొందిస్తే.. మరొకరు గిరిజన, గనుల ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా ప్రయాణికులు, సరుకులను తరలించే వాహనాన్ని రూపొందించాడు. మణుగూరు ఏటీసీలో వెలుగులోకి వచ్చిన ఈ రెండు ఆవిష్కరణలు తెలంగాణ యువతలోని నైపుణ్యం, సృజనాత్మకతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.




















