ఆదిలాబాద్, జూలై 22: గతంలో మట్కా కేసులో నిందితుడిగా ఉండటంతో బైండోవర్ చేసిన వ్యక్తి, తిరిగి అదే తరహా నేరానికి పాల్పడటంతో అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.
ఆదిలాబాద్ పట్టణానికి చెందిన రాయి సునీల్ కుమార్ గతంలో మట్కా కేసులో నిందితుడిగా ఉండటంతో అతడిని బైండోవర్ చేశారు. అయితే బైండోవర్‌లో ఉండగానే మరోసారి మట్కా నిర్వహిస్తున్నట్లు వన్‌టౌన్ పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు.
బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించినట్లు నిర్ధారించిన పోలీసులు దీనిపై నివేదికను ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్ (ఎంఆర్ఓ) కార్యాలయానికి పంపించారు. విచారణ అనంతరం అర్బన్ తహసీల్దార్ శ్రీనివాస్ నిందితుడికి రూ.15 వేల జరిమానా విధించారు. విధించిన జరిమానాను నిందితుడు చెల్లించినట్లు వన్‌టౌన్ సీఐ బి. సునీల్ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, బైండోవర్‌లో ఉన్న వ్యక్తులు విధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వాటిని ఉల్లంఘించి మళ్లీ నేరాలకు పాల్పడితే జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ప్రజలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండి శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు.




















