తొర్రూరు జులై 27: తొర్రూరు మండలం అమరసింగ్ తండాలో అభివృద్ధి పనులకు వేగం పెరిగింది. గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో పాలకుర్తి ఎమ్మెల్యే శ్రీమతి యశశ్విని రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
గ్రామాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, రూ.10 లక్షల వ్యయంతో మహిళా సమైక్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ నిర్వహించారు. అలాగే రూ.5 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు అవసరమైన సదుపాయాలు కల్పించడం, గ్రామాల్లో మెరుగైన రహదారి వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రభుత్వ ప్రాధాన్యత అని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులను వేగవంతంగా అమలు చేస్తున్నామని, గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
మహిళా సమైక్య భవనం నిర్మాణంతో మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు మరింత సౌకర్యవంతంగా నిర్వహించుకునే అవకాశం లభిస్తుందని, సీసీ రోడ్డు నిర్మాణంతో గ్రామ ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బాణోత్ గంగ నరేష్ నాయక్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సంబంధిత శాఖల అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, యువతతో పాటు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




















