జనవాణి: నర్సంపేట, ఆగస్టు 11: వరంగల్ జిల్లా నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం చుట్టూ రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. నిన్న విగ్రహ గద్దెను మున్సిపల్ అధికారులు కూల్చివేయగా.. బీఆర్ఎస్ నేతలు అదే ప్రాంతంలో పెద్ది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీంతో విగ్రహం తొలగించేందుకు మున్సిపల్ అధికారులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడం ఆసక్తికర పరిణామంగా మారింది.
విగ్రహానికి పోలీస్ పహారా
నర్సంపేటలోని మెడికల్ కాలేజీ ముందు ఏర్పాటు చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహానికి పోలీసులు భారీ భద్రత కల్పిస్తున్నారు. విగ్రహాన్ని ఎవరూ తొలగించకుండా రాత్రంతా పోలీసులు అక్కడే మకాం వేశారు. ఇందుకోసం లైట్లు, టెంట్లు ఏర్పాటు చేసుకుని బందోబస్తు నిర్వహిస్తున్నారు.
తొలగింపునకు మున్సిపల్ అధికారుల యత్నం
విగ్రహాన్ని తొలగించేందుకు మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. అయితే వారి ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. విగ్రహం తొలగింపునకు సంబంధించిన ఆర్డర్ కాపీని చూపించాలని పోలీసులు అధికారులను కోరినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
గద్దె కూల్చివేత.. మళ్లీ విగ్రహం ఏర్పాటు
పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను అధికారులు సోమవారం కూల్చివేశారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు గద్దె కూల్చిన ప్రాంతాన్ని పరిశీలించి ఆందోళన చేపట్టారు. ఈ పరిణామాల మధ్యే బీఆర్ఎస్ నేతలు తాజాగా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో వివాదం మరింత ముదిరింది.
పోలీసులు వర్సెస్ మున్సిపల్ అధికారులు
విగ్రహాన్ని తొలగించేందుకు మున్సిపల్ అధికారులు ప్రయత్నించడం.. వారికి పోలీసులు అడ్డుగా నిలవడం నర్సంపేటలో చర్చనీయాంశంగా మారింది. విగ్రహం తొలగింపునకు సంబంధించిన అధికారిక ఆదేశాలు చూపించే వరకు చర్యలు చేపట్టేందుకు పోలీసులు అనుమతించలేదని సమాచారం. దీంతో విగ్రహం వద్ద పోలీసులు పహారా కాస్తుండగా.. మున్సిపల్ అధికారులు తదుపరి చర్యలపై దృష్టి సారించారు.
రాజకీయంగా వేడెక్కిన నర్సంపేట
పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. నిన్న గద్దె కూల్చివేత.. ఈరోజు విగ్రహం ఏర్పాటు.. ఆ తర్వాత దాన్ని తొలగించేందుకు అధికారుల ప్రయత్నం, పోలీసుల అడ్డుకోవడంతో నర్సంపేటలో రాజకీయ హీట్ పెరిగింది. విగ్రహం అక్కడే కొనసాగుతుందా? మున్సిపల్ అధికారులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పోలీసులు, అధికారుల మధ్య పరిస్థితి ఎలా మారుతుంది? అనే అంశాలపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది.




















