నిజామాబాద్, జూలై 22: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా శాంతిభద్రతలు, ప్రజల భద్రత, విద్యార్థుల రక్షణ, ట్రాఫిక్ క్రమశిక్షణ, డ్రగ్స్ నిర్మూలన, మహిళల భద్రత, పట్టణాభివృద్ధి, ఎన్నారై సమస్యలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, ఆసుపత్రుల్లో డ్రగ్స్ నియంత్రణ, ట్రాఫిక్ అవగాహన, ఈవ్‌టీజింగ్ నివారణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, మాదకద్రవ్యాల వినియోగం లేదా విక్రయం, ఈవ్‌టీజింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు లేదా డయల్-100, 1903కు తెలియజేయాలని కోరారు.
విద్యార్థుల రహదారి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటూ.. మైనర్లు వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, ట్రిపుల్ రైడింగ్, అతివేగంతో డ్రైవింగ్ వంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులు కూడా మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
పట్టణాభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని కమిషనర్ పిలుపునిచ్చారు. పరిశుభ్రత, ట్రాఫిక్ క్రమశిక్షణ, పర్యావరణ పరిరక్షణ, సీసీ కెమెరాల ఏర్పాటు, అనుమానాస్పద కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండే విషయంలో ప్రజలు పోలీస్ శాఖతో కలిసి పనిచేయాలని సూచించారు.
ఇటీవల ఎన్నారైలకు సంబంధించిన మోసాలు, కుటుంబ వివాదాలు, ఆస్తి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమావేశంలో చర్చించారు. విదేశాల్లో నివసిస్తున్న వారి కుటుంబ సభ్యులు మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఎన్నారైలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.
సురక్షితమైన, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి పోలీస్ శాఖ, విద్యాసంస్థలు, సెక్యూరిటీ కౌన్సిల్, తల్లిదండ్రులు, ప్రజలు సమిష్టిగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.




















