హైదరాబాద్, జూలై 14: రామగుండంలో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి, నాచారంలో ఈఎస్ఐ నర్సింగ్ కాలేజీని వచ్చే ఏడాది కల్లా ప్రారంభిస్తామని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ & కర్మాగారాల మరియు శాఖ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి, ఈ రెండు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి సేవల్లోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఈఎస్ఐసీ ఆస్పత్రిలో నూతన ఓపీడీ బ్లాక్‌ను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ, డా. గడ్డం వివేక్ వెంకటస్వామి కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, మన్సుఖ్ మాండవీయ నాయకత్వంలో ఈఎస్ఐసీ దేశవ్యాప్తంగా కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా కీలక అడుగులు వేస్తోందని అన్నారు.
తన తండ్రి, మాజీ కేంద్ర కార్మిక శాఖ మంత్రి కాకా వెంకటస్వామి హయాంలో కూడా సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిని సందర్శించానని, ఇప్పుడు రాష్ట్ర కార్మిక మంత్రిగా వచ్చి చూసినప్పుడు ఆస్పత్రిలో వచ్చిన విప్లవాత్మక మార్పులు తనను ఎంతో ఆకట్టుకున్నాయని చెప్పారు. పూర్తి స్థాయి కార్డియాక్ కేర్ సెంటర్, బైపాస్ సర్జరీలు, అత్యాధునిక డయాలసిస్ యూనిట్, క్యాన్సర్ రోగులకు ఆధునిక చికిత్సలు అందించడం ఈఎస్ఐసీ సేవల విస్తరణకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇందుకు కేంద్ర మంత్రి, ఈఎస్ఐసీ అధికారులు, వైద్య సిబ్బందిని అభినందించారు.
తెలంగాణలో సుమారు 20 లక్షల మంది ఐపీలు(Insured Persons), 80 లక్షల మంది లబ్ధిదారులకు ఈఎస్ఐ సేవలు అందుతున్నాయని మంత్రి తెలిపారు. సనత్‌నగర్ ఆస్పత్రిపై ఒత్తిడి తగ్గించేందుకు రామచంద్రాపురం, నాచారం ఆస్పత్రులను అత్యాధునిక వైద్య కేంద్రాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రామచంద్రాపురంలో కార్డియాక్ కేర్ సెంటర్‌తో పాటు 20 పడకల డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయాలని, నాచారంలో ఇప్పటికే కార్డియాక్ సెంటర్‌కు ఆమోదం లభించిన నేపథ్యంలో అక్కడ కూడా 20 పడకల డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.
హైదరాబాద్ తర్వాత తెలంగాణలో రామగుండం అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతమని, అక్కడ పనిచేస్తున్న వేలాది మంది కార్మికులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి అత్యవసరమని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. గతంలో ఆమోదం లభించినప్పటికీ టెండర్ల ప్రక్రియ నిలిచిపోయిందని, వెంటనే పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ, ఆస్పత్రి నిర్మాణాన్ని వేగవంతం చేసి వచ్చే ఏడాది నుంచే సేవలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
విదేశీ ఉపాధి అవకాశాలను కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం టామ్‌కామ్(TOMCOM) ద్వారా దేశంలోనే ముందంజలో ఉందని మంత్రి వివేక్ తెలిపారు. జర్మనీ వంటి దేశాల్లో నర్సింగ్ సిబ్బందికి భారీ డిమాండ్ ఉందని, రాష్ట్రంలో కూడా నర్సుల కొరత ఉన్న నేపథ్యంలో నాచారం ఈఎస్ఐలో నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కళాశాల ద్వారా శిక్షణ పొందిన నర్సులు ఈఎస్ఐ ఆస్పత్రులతో పాటు విదేశాల్లో కూడా ఉపాధి పొందే అవకాశం ఉంటుందని వివరించారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి, నాచారం నర్సింగ్ కాలేజీని కూడా వచ్చే ఏడాది నుంచే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
శంషాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమి కేటాయించిన ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణాన్ని త్వరితగతిన ప్రారంభించాలని, మహబూబ్‌నగర్‌లో కొత్త ఈఎస్ఐ ఆస్పత్రికి అనుమతులు ఇవ్వాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో వరంగల్ ప్రాంతంలో కూడా ఈఎస్ఐ ఆస్పత్రి అవసరం ఉంటుందని తెలిపారు.
భూ సమస్యల కారణంగా నిలిచిపోయిన 15 ఈఎస్ఐ డిస్పెన్సరీలకు మళ్లీ అనుమతులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రం ఆమోదం తెలిపిన వెంటనే 12 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఏర్పాటు చేస్తుందని మంత్రి వివేక్ హామీ ఇచ్చారు.
దేశంలో కిడ్నీ సంబంధిత వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఈఎస్ఐ ఆస్పత్రిలో డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వివేక్ వెంకటస్వామి అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి రోగులు డయాలసిస్ కోసం పట్టణాలకు రావాల్సిన పరిస్థితి ఉందని, అన్ని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తే కార్మికులకు, వారి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
కార్మికుల ఆరోగ్య భద్రతను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, తెలంగాణలో ఈఎస్ఐ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.




















