తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
పెద్ది సుదర్శన్ రెడ్డికి గతంలో భద్రత, వెపన్ లైసెన్స్ కల్పించగా, అనంతరం వాటిని రద్దు చేశారని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ నిర్ణయం వల్ల ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని పేర్కొన్నారు.
అవినీతి అంశాలు ప్రస్తావించడంతోనే
సివిల్ సప్లైస్ శాఖలో రూ.1,100 కోట్ల కుంభకోణం, పాఠశాల విద్యాశాఖలో బంకర్ బెడ్స్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రస్తావించిన తర్వాతే ఆయనను లక్ష్యంగా చేసుకున్నారని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ అంశాలపై ఫిర్యాదులు చేయడంతో పాటు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారని చెప్పారు.
వాసవి కన్స్ట్రక్షన్స్‌కు చెందిన వ్యక్తులు, ఫయీం ఖురేషి వేధింపుల కారణంగానే పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారని కూడా ఆయన ఆరోపించారు.
భద్రతపై ప్రశ్నలు
రాష్ట్రంలో పలువురు నాయకులకు భద్రత కల్పిస్తుండగా, మరికొందరికి ఎందుకు భద్రత తొలగించారో ప్రభుత్వం స్పష్టం చేయాలని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. వివిధ రాజకీయ నాయకులకు కల్పించిన గన్‌మెన్లు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాల విషయంలో అనుసరించిన ప్రమాణాలను వెల్లడించాలని కోరారు.
అలాగే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల భద్రత తొలగించగా, మరికొందరికి 2+2 భద్రత ఎందుకు కల్పించారనే అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
'సెక్యూరిటీ రివ్యూ కమిటీని రద్దు చేయాలి'
సెక్యూరిటీ రివ్యూ కమిటీని వెంటనే రద్దు చేయాలని, భద్రత కల్పింపునకు సంబంధించి థ్రెట్ పర్సెప్షన్ రిపోర్ట్, సెక్యూరిటీ ప్రోటోకాల్‌కు సంబంధించిన మార్గదర్శకాలను ప్రజలకు వెల్లడించాలని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
భద్రతా ముప్పు ఉన్న బీఆర్ఎస్ నాయకులకు కూడా తగిన భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇతర రాష్ట్రాల్లో మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు లేని పరిస్థితిలో తెలంగాణలో ఎందుకు కల్పిస్తున్నారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ప్రశ్నించారు.




















