సూర్యాపేట, న్యూస్ డెస్క్ September 6 (జనవాణి): న్యూడ్ ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ ఓ మహిళను వేధించినట్లు కాంగ్రెస్ నాయకుడు చింతారెడ్డి విజయభాస్కర్ రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. తనపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు వాట్సాప్‌లో అసభ్యకరమైన సందేశాలు పంపుతూ బెదిరించారని బాధితురాలు ఆరోపించింది. ఈ వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.
ఇంట్లోకి చొరబడి ఫొటోలు తీశారంటూ ఆరోపణలు
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో విజయభాస్కర్ రెడ్డి ఇంట్లోకి చొరబడి ఆమెకు సంబంధించిన న్యూడ్ ఫొటోలు తీసినట్లు బాధితురాలు ఆరోపించింది. అనంతరం ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరిస్తూ, వాట్సాప్ ద్వారా అసభ్యకరమైన మెసేజులు పంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
పోలీసులకు ఫిర్యాదు.. చర్యలపై ప్రశ్నలు
వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అయితే నిందితుడు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు కావడంతో పోలీసులు కేసు విషయంలో వెనకడుగు వేస్తున్నారని ఆమె ఆరోపించింది. అంతేకాకుండా నిందితుడితో రాజీ చేసుకుని కేసును వెనక్కి తీసుకోవాలని పోలీసులు తనపై ఒత్తిడి తెచ్చారని బాధితురాలు పేర్కొన్నట్లు సమాచారం.
వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం
నిందితుడి వేధింపులతో పాటు పోలీసుల నుంచి ఎదురైన ఒత్తిడితో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరో ఆరుగురు మహిళలపైనా?
ఇదే వ్యక్తి గతంలో మరో ఆరుగురు మహిళలను కూడా ఇలాంటి విధంగానే వేధించినట్లు స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని బాధితురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నట్లు సమాచారం.
ఆరోపణలపై దర్యాప్తు కీలకం
ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు చేసిన ఆరోపణలు, పోలీసులపై వచ్చిన ఫిర్యాదులు దర్యాప్తులో తేలాల్సి ఉంది. న్యూడ్ ఫొటోలు తీసి బెదిరించారన్న ఆరోపణలు నిజమైతే.. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఫిర్యాదు చేసిన మహిళపై ఎవరైనా ఒత్తిడి తెచ్చారా? అనే అంశంపైనా ఉన్నతాధికారులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది.




















