హైదరాబాద్, జూలై 22: తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఆర్‌ఈడీసీఓ) డిప్యూటీ ఇంజినీర్ (డీఈ) ముత్యం వెంకటరమణ నివాసంలో బుధవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు.
ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై నమోదైన కేసు నేపథ్యంలో డీఎస్పీ మాజి ఖాన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. మాదాపూర్‌లోని వెంకటరమణ నివాసంతో పాటు హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలు కలిపి మొత్తం 10కి పైగా చోట్ల ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి.
తనిఖీల్లో ఆస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, ఇతర కీలక రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. సోదాలు ఇంకా కొనసాగుతున్నందున స్వాధీనం చేసుకున్న నగదు, ఆస్తులు, పత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
ఏసీబీ అధికారులు సోదాలు పూర్తయిన అనంతరం పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.




















